భారత్ తరఫున అత్యంత ప్రభావం చూపిన ఆటగాడు అతనే: సునీల్ గావస్కర్

న్యూఢిల్లీ: గత పదేళ్లలో టీమిండియాపై ఎక్కువ ప్రభావం చూపిన ఆటగాడు విరాట్ కోహ్లీనేనని మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ అన్నాడు. ఈ దశాబ్దకాలంలో భారత జట్టుకు అతను అత్యధిక విజయాలు అందించాడని ప్రశంసించాడు. అయితే ఆస్ట్రేలియా మాజీ విధ్వంసకర ఓపెనర్ మాథ్యూ హెడెన్ మాత్రం సునీల్ గావస్కర్ అభిప్రాయంతో విభేదించాడు. తన దృష్టిలో కోహ్లీ కన్నా మహేంద్ర సింగ్ ధోనీనే ఎక్కువ ప్రభావం చూపించిన ఆటగాడని స్పష్టం చేశాడు. స్టార్ స్పోర్ట్స్ 'క్రికెట్ కనెక్టెడ్' షోలో 'గత పదేళ్లలో భారత క్రికెట్ పై ప్రభావం చూపిన ఆటగాళ్లేవరూ'అనే అంశంపై జరిగిన చర్చలో ఈ దిగ్గజ క్రికెటర్లు పాల్గొన్నారు.

విజయాల పరంగా కోహ్లీనే..
ఈ సందర్భంగా గావస్కర్ మాట్లాడుతూ.. ‘వ్యక్తిగతంగా చూస్తే విరాట్ కోహ్లీనే అత్యంత ప్రభావం చూపించిన ఆటగాడు. గత దశాబ్దకాలంలో భారత్‌కు ఎక్కువ విజయాలు అందించింది అతనే. అది కూడా చేజింగ్‌లో గెలిపించాడు. ఈ విషయంలో నేను చేసిన పరుగులు, తీసిన వికెట్లను నేను ప్రామాణికంగా తీసుకోవడం లేదు. మ్యాచులు గెలిపించడాన్ని తీసుకున్నా' అని గవాస్కర్ తెలిపాడు.

ప్రపంచకప్ గెలిచింది ధోనీనే..
ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మాథ్యూ హెడెన్ మాత్రం గవాస్కర్‌తో విభేదించాడు. జట్టుపై అత్యంత ప్రభావం చూపించింది భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అని చెప్పాడు. ‘మహేంద్ర సింగ్ ధోనీ ప్రపంచకప్, చాంపియన్స్ ట్రోఫీ గెలిచాడన్నది ముఖ్యం. నా దృష్టిలో ఆ ప్రపంచకప్ గెలవడమే అతిపెద్ద మైలురాయి. గతంలోనూ నేనిదే చెప్పాను. విపరీతంగా వన్డే క్రికెట్ ఆడుతున్నప్పుడు, ప్రపంచకప్‌కు సిద్ధమవుతున్నప్పుడు మంచి నాయకుడిగా ఉండటమే కాదు మిడిలార్డర్లో అతడిలా ప్రశాంతంగా ఉండటమూ అవసరమే' అని హెడెన్ చెప్పుకొచ్చాడు.

విరాట్ 12K..
విరాట్ కోహ్లీ 2008లో భారత జట్టులో అరంగేట్రం చేశాడు. గత దశాబ్ద కాలంలో అన్ని ఫార్మాట్లలో కీలకమైన ఆటగాడిగా ఎదిగాడు. ఈ మధ్యే ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీసులోనే 12,000 పరుగుల మైలురాయి అందుకున్నాడు. ఈ ఘనతను అత్యంత వేగంగా సాధించిన సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. సచిన్, రికీ పాంటింగ్, కుమార సంగాక్కర, సనత్ జయసూర్య, మహేళ జయవర్దనే ఈ ఘనతను అందుకోవడానికి 300కు పైగా ఇన్నింగ్స్‌లు ఆడగా.. విరాట్ కేవలం 242 ఇన్నింగ్స్‌లోనే పూర్తి చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications