టీమిండియా టీ20 ప్రపంచకప్ 2024 విజయంలో కీలక పాత్ర పోషించిన దిగ్గజ క్రికెటర్, దివాల్ రాహుల్ ద్రవిడ్‌కు భారత రత్న ఇవ్వాలని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. కెప్టెన్‌గా.. ఆటగాడిగా.. కోచ్‌గా ఎనలేని సేవలు అందించిన రాహుల్ ద్రవిడ్‌ను కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారంతో గౌరవించాలని లిటిల్ మాస్టర్ డిమాండ్ చేశాడు.
అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహించిన టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. అసాధారణ ప్రదర్శనతో ఫైనల్ చేరిన టీమిండియా.. సౌతాఫ్రికాను ఓడించి 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐసీసీ టైటిల్‌ను ముద్దాడింది. ఓటమెరుగని జట్టుగా టీ20 ప్రపంచకప్ అందుకున్న తొలి జట్టుగా చరిత్రకెక్కింది.

టీమిండియా విజయం వెనుక హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పాత్ర ఎంతో ఉంది. గత సెప్టెంబర్‌లోనే అతని పదవి కాలం ముగియగా కెప్టెన్ రోహిత్ శర్మ విజ్ఞప్తితో అతను తన కోచింగ్ బాధ్యతలను ప్రపంచకప్ వరకు పొడిగించుకున్నాడు. టీ20 ప్రపంచకప్ 2021 అనంతరం టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన రాహుల్ ద్రవిడ్.. రోహిత్ సేన అసాధారణ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టే ముందు రాహుల్ ద్రవిడ్ రెండేళ్ల పాటు ఎన్‌సీఏ డైరెక్టర్‌గా కుర్రాళ్లను తయారు చేశాడు. భారత్ అండర్ 19 జట్టుతో పాటు భారత్-ఏ జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు. ప్రస్తుతం జట్టులో ఉన్న రిషభ్ పంత్‌తో పాటు అర్ష్‌దీప్ సింగ్‌లు రాహుల్ ద్రవిడ్ తయారు చేసిన ఆటగాళ్లే. ఈ క్రమంలోనే రాహుల్ ద్రవిడ్‌కు భారత రత్న ఇవ్వాలనే డిమాండ్ చేద్దామని సునీల్ గవాస్కర్ ఓ దిన పత్రికకు రాసిన కాలమ్‌లో పిలుపు నిచ్చాడు.
'రాహుల్ ద్రవిడ్ సారథిగా.. ఆటగాడిగా.. కోచ్‌గా టీమిండియాకు ఎనలేని సేవలు అందించాడు. ఎన్‌సీఏ డైరెక్టర్‌గా ప్రతిభావంతులైన కుర్రాళ్లను భారత క్రికెట్‌కు పరిచయం చేశాడు. హెడ్ కోచ్‌గా టీమిండియాకు అద్భుతమైన ఫలితాలు అందించాడు. 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమిండియాను విశ్వవిజేతగా నిలబెట్టాడు. కెరీర్‌లో ఏనాడు స్వార్థం చూపించలేదు.
రాహుల్ ద్రవిడ్ అన్ని వర్గాలను అలరించిన వ్యక్తి. రాహుల్ ద్రవిడ్‌కు దేశ అత్యున్న పురస్కారం భారత రత్న ఇవ్వాలనే డిమాండ్ చేద్దాం. భారత రత్న రాహుల్ ద్రవిడ్.. ఈ మాట వింటేనే అద్భుతంగా అనిపిస్తోంది. రాహుల్ ద్రవిడ్ కు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుదాం. మీరు కూడా నాతో చేయి కలపండి. రాహుల్ ద్రవిడ్‌కు భారత రత్న ఇవ్వాలనే డిమాండ్ ప్రభుత్వం ముందు ఉంచుదాం'అని సునీల్ గవాస్కర్ తన కథనంలో రాసుకొచ్చాడు.
దేశ అత్యున్నత పురస్కారాన్ని క్రీడా రంగం నుంచి దిగ్గజ క్రికెటర్, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ మాత్రమే అందుకున్నారు. 2014లో అతనికి ఈ అత్యున్నత పురస్కారం లభించింది. ఈ అవార్డు అందుకున్న అతి పిన్నవయస్కుడిగా కూడా సచిన్ చరిత్రకెక్కారు.