టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతను కెప్టెన్‌గా ఉండటం టీమిండియా అదృష్టమని కొనియాడాడు. కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోనీలా రోహిత్ శర్మ కూడా ప్రజల కెప్టెన్ అని అభిప్రాయపడ్డాడు. టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియాను విజేతగా నిలబెట్టిన రోహిత్ శర్మను గవాస్కర్ అభినందించాడు.
టీ20 ప్రపంచకప్ 2024 విజయం నేపథ్యంలో ఓ పత్రికకు రాసిన తన కాలమ్‌లో రోహిత్ శర్మను ఆకాశానికెత్తాడు. '2007లో టీమిండియా ప్రపంచకప్ , 2013 ఛాంపియన్స్ ట్రోఫీలు గెలిచిన భారత జట్టులో రోహిత్ శర్మ సభ్యుడిగా ఉన్నాడు. 2023 వన్డే ప్రపంచకప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ రన్నరప్‌గా నిలిచిన జట్టుకు రోహిత్ సారథిగా వ్యవహరించాడు. ఇటీవల రోహిత్ సేన టీమిండియాకు టీ20 ప్రపంచకప్ అందించాడు.

టీమిండియా విజేతగా నిలవడంలో రోహిత్ శర్మ కీలక పాత్ర పోషించాడు. ఇది అతని కెరీర్‌లోనే గొప్ప విజయం. ఈ క్రమంలో భారత జట్టుకు ప్రపంచకప్ అందించిన కపిల్ దేవ్, ధోనీ సరసన రోహిత్ చేరాడు. వీరిద్దరిలాగే రోహిత్ సైతం ప్రజలు మెచ్చే కెప్టెనే. క్రికెట్ అభిమానులంతా రోహిత్ సారథ్య పటిమను గుర్తించారు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు రోహిత్ చాలా తెలివిగా వ్యవహరిస్తాడు.
మెగా టోర్నీలో రోహిత్ 156.70 స్ట్రైక్‌రేట్‌తో 257 రన్స్ చేశాడు. తన వ్యక్తిగత మైలురాళ్ల కోసం కాకుండా జట్టు విజయం కోసం ఆడుతాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో జరిగిన కీలక మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ బ్యాటింగ్ చూస్తే ఈ విషయం అర్థమవుతోంది.
దూకుడైన బ్యాటింగ్‌తో అదిరిపోయే శుభారంభాలు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. టీ20 ప్రపంచకప్ విజయంతో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తన కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని అందుకున్నాడు.'అని గవాస్కర్ తన కాలమ్‌లో రాసుకొచ్చాడు.