అది 'రియల్ చాలెంజర్స్ బెంగళూరు'.. ఈ సారి టైటిల్ కోహ్లీసేనదే: సునీల్ గవాస్కర్

ముంబై: ఐపీఎల్ 2021 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జోరు కొనసాగుతోంది. మునుపెన్నడూ లేనివిధంగా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. రాజస్థాన్ రాయల్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో కోహ్లీసేన 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ హర్షం వ్యక్తం చేశారు. ఆర్‌సీబీ టీమ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. అది రియల్ చాలెంజర్స్ బెంగళూరని కొనియాడుతూ ఈసారి టైటిల్ వారిదేనని అంచనావేసాడు. స్టార్ స్పోర్ట్స్ చానెల్ పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌లో మాట్లాడుతూ విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ ఆడిన షాట్లను మెచ్చుకున్నాడు.

విరాట్, పడిక్కల్ సూపర్..
'విరాట్, పడిక్కల్ లెఫ్ట్, రైట్ కాంబినేషన్ కారణంగా రాజస్థాన్ బౌలర్లకు బౌలింగ్ చేయడం కష్టంగా మారింది. దేవదత్‌ను ఓపెనర్‌గా ఎంపిక చేసుకోవడం మంచి నిర్ణయం. వీరిద్దరి కాంబినేషన్ బాగుండటం.. కోహ్లి ఓపెనర్‌గా స్థిరపడటానికి ఉపకరిస్తుంది. వీరు చూడముచ్చటైన షాట్లు ఎంచుకోవడంతో పాటు పవర్ పుల్ షాట్లు ఆడుతున్నారు. ప్లేస్‌మెంట్ కూడా బాగుంది. కొన్ని కష్టమైన బంతులను సైతం ఫోర్లు, సిక్సర్లుగా మలుస్తున్నారు. వీరిది అసాధారణ ప్రదర్శన.'అని సునీల్ గవాస్కర్ ప్రశంసించాడు.

ఆశ్చర్యపోనక్కర్లేదు..
పడిక్కల్ అంతర్జాతీయ క్రికెట్ ఆడినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నాడు. 'ఇన్నేళ్లు ఆర్సీబీ బాగానే ఆడినా..ఈ సారి మాత్రం ''రియల్ ఛాలెంజర్స్ బెంగళూరు''గా మారుతోంది. ఐపీఎల్-14 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదటిసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడే అవకాశం ఉంది. పడిక్కల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్, రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు. వాటిల్లో భారీ శతకాలు సైతం సాధించాడు. దేశవాళీ టీ20 టోర్నీల్లోనూ గణనీయమైన పరుగులు సాధించాడు. అతను ఏ ఫార్మాట్‌లోనైనా భారత్ తరఫున ఆడితే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అందుకు అవసరమైన సత్తా అతని దగ్గర ఉంది'అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

సంజూపై ఫైర్
రాజస్థాన్ రాయల్స్ సంజూ శాంసన్‌పై గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతని నిలకడలేమి తనం వల్లే టీమిండియాలో చోటు దక్కించుకోలేకపోతున్నాడని మండిపడ్డాడు.'సంజూకు ఎలా అవుట్ కావాలో.. అతనికి తెలిసినంత బాగా మరెవరికీ తెలియదు. అవుట్ కావడానికి మార్గాలను సంజు శాంసన్ వెతుక్కుంటాడు. క్రికెట్ షాట్లకు దూరంగా అతని బ్యాటింగ్ శైలి ఉంటుంది. అతని బ్యాటింగ్ మళ్లీ గాడిన పడాలంటే.. సరైన క్రికెట్ షాట్లను ఆడాలి. ప్రస్తుత పరిస్థితుల్లో అది అసాధ్యమని నాకు అనిపిస్తోంది. అతనితో అతనికే సమస్యలు ఉన్నాయి. ఈ తరహా బ్యాటింగ్‌తోనే టీమిండియాలో చోటును శాశ్వతం చేసుకోలేకపోతున్నాడు. తొలి మ్యాచ్‌లో సెంచరీ చేసిన ఓ ప్లేయర్.. ఆ తరువాతి మ్యాచ్‌లల్లో రాణించట్లేదంటే లోపం అతనిలోనే ఉన్నట్లు భావించాల్సి ఉంటుంది'అని గవాస్కర్ చురకలంటించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications