ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్థాన్ విజేతగా నిలుస్తుందని టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ అంచనా వేసాడు. ఈ టోర్నీలో తీవ్ర పోటీ ఉన్నప్పటికీ.. ఆతిథ్య దేశంగా పాకిస్థాన్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డాడు.
ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్ వేదికగా హైబ్రిడ్ మోడల్‌లో ఈ టోర్నీ జరగనున్న విషయం తెలిసిందే. భారత్ మ్యాచ్‌లు దుబాయ్ వేదికగా జరగనున్నాయి. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరగనుంది. చివరిసారిగా ఛాంపియన్స్ ట్రోఫీ 2017లో నిర్వహించగా.. పాకిస్థాన్ విజేతగా నిలిచింది. ఫైనల్లో భారత్‌ను ఓడించి టైటిల్‌ను అందుకుంది.

తాజాగా ఈ టోర్నీ గురించి మాట్లాడిన సునీల్ గవాస్కర్.. సొంతగడ్డపై పాకిస్థాన్‌ను ఓడించడం ప్రత్యర్థులకు కష్టమేనని చెప్పాడు. 'ఛాంపియన్స్ ట్రోఫీలో ఫేవరేట్ అనే ట్యాగ్ హోమ్ టీమ్‌కే ఇవ్వాలి. సొంతగడ్డపై పాక్‌ను ఓడించడం సులువైన పనికాదు. స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత్ ఓటమెరుగని జట్టుగా ఫైనల్ చేరింది. ఈ విషయాన్ని అందరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు కూడా పాకిస్థాన్ జట్టుకు అలాంటి అవకాశమే ఉంది. సొంతగడ్డపై ఆ జట్టును ఓడించడం కష్టమే. అందుకే పాకిస్థాన్ ఫేవరేట్‌గా భావిస్తున్నా'అని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు.
మరోవైపు దుబాయ్ పిచ్‌లు పేస్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటాయని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. పేస్ విభాగంగా బలంగా ఉన్న జట్టు విజేతగా నిలుస్తుందన్నాడు. ఈ టోర్నీలో బరిలోకి దిగే భారత జట్టును శనివారం ప్రకటించారు. కెప్టెన్‌గా రోహిత్ శర్మ కొనసాగనుండగా.. అతనికి డిప్యూటిగా శుభ్‌మన్ గిల్ వ్యవహరించనున్నాడు. జస్‌ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్ సాధిస్తే ఈ టోర్నీలో ఆడుతాడని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తెలిపాడు. మహమ్మద్ సిరాజ్ స్థానంలో అర్ష్‌దీప్ సింగ్‌ను ఎంపిక చేశారు. వెటరనే పేసర్ మహమ్మద్ షమీ కూడా జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు.