
దుబాయ్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో నేడు(ఆదివారం) జరిగే కీలక పోరులో అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ కీలమవుతాడని భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. ముజీబ్ గనుక ఫిట్‌గా ఉండి ఈ మ్యాచ్ ఆడితే న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌కు ముచ్చెమటలు పట్టడం ఖాయమని చెప్పాడు. సూపర్ 12 గ్రూప్ 2లో భాగంగా జరిగే ఈ మ్యాచ్ ఫలితంపై సెకండ్ సెమీఫైనలిస్ట్ ఎవరో తేలనుంది. ముఖ్యంగా భారత జట్టు భవితవ్యంపై అఫ్గాన్ చేతిలోనే ఆధారపడి ఉంది.
అఫ్గానిస్థాన్ గనుకు న్యూజిలాండ్‌ను ఓడిస్తే.. టీమిండియాకు సెమీస్ చేరే అవకాశం ఉంటుంది. సోమవారం నమీబియాపై భారీ విజయం సాధించి మెరుగైన రన్ రేట్ సాధిస్తే నాకౌట్ చేరుతుంది. న్యూజిలాండే గెలిస్తే మాత్రం ఆ జట్టు నేరుగా సెమీఫైనల్లోకి అడుగుపెడుతుంది. ఈ క్రమంలోనే అప్గాన్-న్యూజిలాండ్ మధ్య నేడు జరిగే మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత అభిమానులంతా అఫ్గాన్ విజయాన్ని కోరుకుంటున్నారు.
ఇక ఈ మ్యాచ్‌పై స్టార్ స్పోర్ట్స్ చానెల్‌లో మాట్లాడిన గవాస్కర్.. ముజీబ్ కీలకమవుతాడని చెప్పాడు. వరుణ్ చక్రవర్తీలా అతని బౌలింగ్ ఆడటం కష్టమని చెప్పుకొచ్చాడు. వరుణ్ కన్నా ఎక్కువ అనుభవం కలిగిన ముజీబ్ న్యూజిలాండ్‌ను ఇబ్బంది పెట్టగలడని పేర్కొన్నాడు. నబీ, ముజీబ్, రషీద్ స్పిన్ త్రయం చెలరేగితే న్యూజిలాండ్‌కు కష్టాలు తప్పవన్నాడు.
'ముజీబ్ ఉర్ రెహ్మాన్ ఫిట్‌గా ఉండి ఈ మ్యాచ్ బరిలోకి దిగాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే న్యూజిలాండ్‌ను ఓడించాలంటే అదనపు మిస్టరీ స్పిన్నర్ అవసరం. రషీద్ ఖాన్, మహమ్మద్ నబీతో కలిసి అతను చెలరేగితే న్యూజిలాండ్‌కు కష్టాలు తప్పవు. భారత్ అద్భుత ప్రదర్శన కనబర్చడంతో రేసులోకి వచ్చింది. న్యూజిలాండ్‌ను అఫ్గాన్ ఓడిస్తే టీమిండియా సెమీస్ చేరేందుకు మార్గం సుగుమమవుతోంది. ముజీబ్‌తో పాటు రషీద్ ఖాన్ ఈ మ్యాచ్‌లో కీలక పాత్ర పోషించనున్నారు. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తీలా బౌలింగ్ చేసే ముజీబ్ బౌలింగ్ ఆడటం చాలా కష్టం. వరుణ్ కన్నా అతనికి ఇంకా అనుభవం ఎక్కువ. కాబట్టి అతను, రషీద్ ఖాన్ న్యూజిలాండ్ జట్టును ఇబ్బంది పెట్టగలరు.'అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.
మామూలుగానైతే ఈ అఫ్గాన్-న్యూజిలాండ్ మ్యాచ్‌ను ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ.. ఈ మ్యాచ్ ఫలితంపైనే భారత జట్టు భవితవ్యం ఆధారపడి ఉండటంతో కోట్లాది భారత అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ గెలిస్తేనే భారత జట్టుకు సెమీస్ అవకాశం ఉంటుంది. అప్పుడు అఫ్గాన్, కివీస్, భారత్ (నమీబియాతో విజయంతో)కు సమానంగా ఆరు పాయింట్లుంటాయి.
కానీ అందరికంటే ఎక్కువ నెట్‌రన్‌రేట్ కలిగిన కోహ్లీ సేన సెమీస్‌లో అడుగుపెడుతుంది. అందుకే ఎలాగైనా కివీస్‌పై నబీ సేన గెలిచి మన జట్టుకు దారి చూపాలని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ పటిష్టంగా కనిపిస్తున్న న్యూజిలాండ్ ఈ మ్యాచ్‌లో గెలిస్తే చాలు.. ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా నేరుగా సెమీస్‌కు వెళుతుంది. ఇదే జరిగితే భారత్ ఆశలు ఆవిరై, నమీబియాతో జరిగే చివరి మ్యాచ్ నామమాత్రమవుతుంది.