న్యూఢిల్లీ: ఆసియాకప్ 2023 కోసం ఎంపిక చేసిన భారత జట్టు నచ్చకపోతే మ్యాచ్‌లు చూడవద్దని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ హితవు పలికాడు. అనవసర విమర్శలతో వివాదాలు సృష్టించే బదులు.. జట్టుకు మద్దతుగా నిలవాలని సూచించాడు. ఆసియాకప్ బరిలోకి దిగే భారత జట్టును అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే.
17 మంది సభ్యులతో కూడిన జట్టులో తెలుగు తేజం తిలక్ వర్మకు చోటు దక్కగా.. గాయాలతో జట్టుకు దూరమైన సీనియర్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిధ్ కృష్ణ రీఎంట్రీ ఇచ్చారు. యుజ్వేంద్ర చాహల్‌ను పక్కనపెట్టిన సెలెక్టర్లు కుల్దీప్ యాదవ్‌ను ఎంపిక చేశారు. అయితే చాహల్‌తో పాటు అశ్విన్ పక్కనపెట్టడంపై విమర్శలు వచ్చాయి.

ఇది ముంబై ఇండియన్స్ జట్టులానే ఉందని, ముంబై లాబియింగ్ బాగా నడిచిందని సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు వచ్చాయి. ఈ విమర్శలపై సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు. అనవసర విమర్శలతో వివాదాలు సృష్టించే బదులు.. జట్టుకు మద్దతుగా నిలవాలని సూచించాడు.
'ఆసియాకప్ జట్టులో చోటు దక్కించుకున్న కొంత మంది ఆటగాళ్లు అదృష్టవంతులే. టీమ్ సెలక్షన్ జరిగిపోయింది. అశ్విన్, చాహల్ గురించి మాట్లాడకండి. వివాదాలు సృష్టించడం ఆపండి. ఇది మన భారత జట్టు. ఈ ఎంపిక నచ్చకపోతే.. మ్యాచ్‌లను చూడటం మానేయండి. అంతే కానీ.. అతన్ని తీసుకోండి.. ఇతన్ని ఎందుకు తీసుకున్నారు..? లాంటి చర్చ జరపవద్దు. ఇది తప్పుడు ఆలోచనా ధోరణి' అంటూ గవాస్కర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
టీమ్ కాంబినేషన్ కోసమే చాహల్‌ను పక్కనపెట్టారని గవాస్కర్ విశ్లేషించాడు. 'కొన్నిసార్లు జట్టులో సమతుల్యత ముఖ్యం. లోయర్ ఆర్డర్‌లో కుల్దీప్ బ్యాటింగ్ కూడా చేస్తాడు. చాహల్ కంటే కుల్‌దీప్ వైపు మొగ్గు చూపడానికి ఇదే కారణమై ఉండొచ్చు' అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
భారత్ జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, మహమ్మద్ షమి, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, సంజు శాంసన్ (రాహుల్‌కు బ్యాకప్).