
ముంబై: ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా అదరగొడుతుందని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అంచనా వేశాడు. ఇంగ్లండ్‌తో ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 14 వరకు జరిగే ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను కోహ్లీ సేన 4-0తో కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లకు అనుకూలంగా ఉండేలా పిచ్‌లపై పచ్చికను ఉంచినా ఆశ్చర్యం లేదని పేర్కొన్నాడు. అయినా భారత్‌కు జరిగే నష్టమేం లేదని, సమర్థవంతమైన పేసర్లున్నారని తెలిపాడు.
ప్రతిష్టాత్మ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్, ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్ కోసం టీమిండియా గురువారమే యూకేలో అడుగుపెట్టింది. ప్రస్తుతం సౌతాంప్టన్ మైదానంలోని హోటల్‌లో క్వారంటైన్ పాటిస్తుంది. మూడు రోజుల తర్వాత ప్రాక్టీస్ షురూ చేయనుంది. జూన్ 18-22 వరకు న్యూజిలాండ్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడనున్న టీమిండియా.. ఆ తర్వాత ఆగస్టు-సెప్టెంబర్ మధ్య ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీసు ఆడుతుంది. ఈ సిరీసును రెండు జట్లు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఎండకాలం కావడం, డ్యూక్ బాల్స్ వాడుతుండటంతో పిచ్‌లు టర్న్ అవుతాయని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. దాంతో కోహ్లీసేన సిరీస్‌ను స్వీప్ చేస్తుందన్నాడు.
'న్యూజిలాండ్‌తో ఫైనల్ ముగిసిన ఆరు వారాల తర్వాత ఇంగ్లండ్ సిరీస్ ఆరంభమవుతుంది. కాబట్టి ఫైనల్ ఫలితం ప్రభావం భారత్×ఇంగ్లండ్ సిరీసుపై తక్కువగా ఉంటుంది. ఆగస్టు, సెప్టెంబర్లో ఆడుతున్నారు కాబట్టి భారత్ 4-0తో సిరీస్ కైవసం చేసుకుంటుంది. భారత్‌లో పర్యటించినప్పుడు స్పిన్ పిచ్‌లపై ఆంగ్లేయులు పెదవి విరిచారు. కానీ ఇప్పుడు ఇంగ్లండ్‌లో పిచ్‌లపై పచ్చికను ఉంచినా ఆశ్చర్యం లేదు. అది కోహ్లీసేనకు సమస్యేమీ కాదు. అలాంటి పిచ్‌లపై రాణించగల పేసర్లు మనకు ఉన్నారు. దాంతో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ కచ్చితంగా ఇబ్బంది పడతారు' అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.