
న్యూఢిల్లీ: ఇటీవలే టీమిండియా పూర్తి స్థాయి కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించిన రోహిత్ శర్మకు ముందు ముందు కఠిన సవాళ్లు ఎదురుకానున్నాయని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నాడు. తీరిక లేని క్రికెట్ షెడ్యూల్ కారణంగా ఆటగాళ్లు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండేలా చూసుకోవడం కెప్టెన్‌గా రోహిత్‌కు సవాల్‌తో కూడుకున్న పని అని అభిప్రాయపడ్డాడు. అంతేకాకుండా వ్యక్తిగతంగా ఫిట్‌నెస్ కాపాడుకోవడం కూడా కష్టమేనని చెప్పాడు. ఈ విషయంలో టీమ్‌మేనేజ్‌మెంట్ కూడా కీలక పాత్ర పోషించాలని సూచించాడు.
'బిజీ షెడ్యూల్ కారణంగా ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన చేసేలా చూసుకోవడం రోహిత్‌కు అతిపెద్ద సమస్య. అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియాతో పాటు అన్ని జట్లూ తీరిక లేకుండా ఆడుతున్నాయి. ఈ నేపథ్యంలో క్రికెటర్లు మానసికంగా, శారీరకంగా దృడంగా ఉండేలా చూసుకోవాలి. వచ్చేనెలలో శ్రీలంకతో టెస్ట్ సిరీస్ తర్వాత రెండు నెలల పాటు ఐపీఎల్ ఉంటుంది. ఆపై సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లతో టీమిండియా టీ20 సిరీస్‌లు ఆడాల్సి ఉంది. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్ కూడా ఉంది. ఇలా ఊపిరి సడలని షెడ్యూల్ ఉండటంతో ఆటగాళ్లు తమ ఫామ్, ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం చాలా ముఖ్యమైన విషయం. దీన్ని రోహిత్, జట్టు మేనేజ్‌మెంట్ ఎలా సమన్వయం చేసుకుంటారనేది పెద్ద సమస్య.'అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.
వెస్టిండీస్ వన్డే, టీ20 సిరీస్‌లను క్లీన్ స్వీప్ చేసిన రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్.. ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభమయ్యే మూడు టీ20ల సిరీస్‌కు సమాయత్తం అవుతోంది. ఈ సిరీస్‌కు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ దూరం కాగా.. యువ ఆటగాళ్లకు అవకాశం దక్కింది. ప్రపంచకప్ నేపథ్యంలో టీమ్ కాంబినేషన్‌ను సెట్ చేయాలనుకుంటున్న టీమిండియా.. యువ ఆటగాళ్ల సత్తాను పరీక్షించనుంది. మార్చి 4 నుంచి ప్రారంభమయ్యే రెండు టెస్ట్‌ల సిరీస్‌తో రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు.