
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు దిగ్గజ బ్యాట్స్‌మన్ సునీల్ గవాస్కర్ విలువైన సలహా ఇచ్చాడు. క్రీజులో సెటిల్ అయ్యేవరకు రోహిత్ తన ఫేవరేట్ పుల్ షాట్ ఆడవద్దని సూచించాడు. ఇటీవల రోహిత్ పుల్ షాట్ ఆడబోయి వికెట్ పారేసుకుంటున్న విషయం తెలిసిందే. ఫేవరేట్ షాట్ కాస్త హిట్‌మ్యాన్ బలహీనతగా మారింది. దాంతో ప్రతీ జట్టు బౌలర్.. రోహిత్‌కు ఊరించే షార్ట్ పిచ్ బాల్‌తో రెచ్చగొడుతూ.. దానికి తగ్గ ఫీల్డ్ సెట్ చేసి ఫలితం రాబడుతున్నారు.
కొన్నిసార్లు రోహిత్ పర్‌ఫెక్ట్‌గా ఆడిన్నా.. ఎక్కువ సార్లు ఔటయ్యాడు. శ్రీలంకతో మొహాలీ వేదికగా జరిగిన ఫస్ట్ టెస్ట్‌లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. ఆ మ్యాచ్‌లో మంచి టచ్‌లో కనిపించిన రోహిత్.. లాహిరు కుమార వేసిన షార్ట్ పిచ్ బాల్‌ను పుల్‌షాట్‌గా ఆడబోయి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలోనే పుల్ షాట్ ఆడే విషయంలో రోహిత్ శర్మ అప్రమత్తంగా ఉండాలని గవాస్కర్ సూచించాడు. బెంగళూరు వేదికగా శనివారం నుంచి ప్రారంభంకానున్న రెండో టెస్ట్‌లోనైనా క్రీజులో సెట్ అయ్యేంతవరకు ఈ షాట్ ఆడవద్దని స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడిన గవాస్కర్ హిట్‌మ్యాన్‌కు సలహా ఇచ్చాడు.
'పుల్ షాట్ ఆడటంపై రోహిత్ శర్మ సీరియస్‌గా ఆలోచించాలి. ఇది అతని ఫేవరేట్ షాటని, ఎన్నో పరుగులు చేశాడని నాతో మీరంతా వాదించవచ్చు. కానీ ఆ షాట్ ఆడబోయే రోహిత్ చాలా సార్లు ఔటయ్యాడనే విషయాన్ని మీరు గ్రహించాలి. ఈ షాట్ కారణంగా ప్రతీ బౌలర్ ముందు హిట్‌మ్యాన్ తక్కువ అయిపోయాడు. ప్రతీ ఒక్కరు షార్ట్ పిచ్ బాల్స్ వేస్తూ అతన్ని ఔట్ చేస్తున్నారు.
ఈ షాట్‌తో అతను కొట్టే బౌండరీలు, సిక్స్‌లు కంటే.. బంతి గాల్లోకి లేచి ఔటయ్యే చాన్స్ క్రియేట్ చేస్తున్నాడు. ఒకసారి ఈ షాట్‌తో అతను చేసిన పరుగులు, ఔటైన సందర్భాలను చూసుకోవాలి. పర్సంటేజ్ గమనించాలి. అప్పుడు అతనికే అర్థమవుతుంది. క్రీజులో సెట్ అయి.. 80,90, 100 పరుగులు చేసేవరకు రోహిత్ పుల్ షాట్ జోలికి వెళ్లకపోవడమే అతనికి మంచిది'అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.