
న్యూఢిల్లీ: భారత క్రికెట్‌లో చోటు చేసుకుంటున్న వివాదాలకు ముగింపు పలకాలంటే టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ఇద్దరూ కలిసి మీడియా ముందుకు రావాలని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. ఇక వన్డే కెప్టెన్సీ మార్పు నిర్ణయం భారత క్రికెట్‌లో అగ్గిని రాజేసిన విషయం తెలిసిందే. ఈ వివాదం రోజుకో మలుపు తిరుగుతూ.. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. నిన్నటి వరకు రోహిత్ X విరాట్‌గా ఉన్న పరిస్థితి.. ఇప్పుడు కోహ్లీ X బీసీసీఐగా మారింది.
టీ20 కెప్టెన్సీ వదులు కోవద్దని తాను కోహ్లీని పర్సనల్‌గా రిక్వెస్ట్ చేశానని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ చెప్పగా.. అలాంటిదేమి జరగలేదని విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. టీ20 కెప్టెన్సీపై పునరాలోచన చేయాలని తనను ఎవరూ కోరలేదని సౌతాఫ్రికా పర్యటనకు బయల్దేరే ముందు బుధవారం జరిగిన ప్రెస్‌మీట్‌లో విరాట్ కోహ్లీ కుండబద్దలు కొట్టాడు. అంతేకాకుండా వన్డే కెప్టెన్సీ మార్పుపై కూడా తనకు ముందస్తు సమాచారం ఇవ్వలేదన్నాడు. కోహ్లీ వ్యాఖ్యలతో గంగూలీతో సహా బీసీసీఐ పెద్దలంతా ఇరకాటంలో పడ్డారు.
ఇక ఈ వివాదంపై స్పందించిన గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ-గంగూలీ వివాదంలో.. భారత టెస్ట్ కెప్టెన్ లేవనెత్తిన అంశాలపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీసీసీఐ మీదికంటే ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీపైనే ఎక్కువగా ఉందని సునీల్ గవాస్కర్ అన్నాడు. ఇద్దరూ కలిసి మీడియా ముందుకు వస్తే ఈ వివాదానికి తెరిదించవచ్చన్నాడు. ఇక సెప్టెంబర్‌లో టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకునే నిర్ణయం ప్రకటించినప్పుడు కోహ్లీ చేసిన వ్యాఖ్యలే బీసీసీఐకి నచ్చకపోయి ఉండొచ్చని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
అందుకే ఇప్పుడు అతడిని వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించి ఉంటారని చెప్పాడు. ఈ ఏడాది యూఏఈలో ఐపీఎల్ జరుగుతున్న సమయంలో కోహ్లీ టీ20 ప్రపంచకప్ తర్వాత టీమ్‌ఇండియా టీ20 సారథిగా తప్పుకొంటానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పుడు కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు చేసి.. ఇకపై టెస్టులు, వన్డే మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేస్తానని చెప్పాడు. అయితే ఆ వ్యాఖ్యలే బీసీసీఐ పెద్దలకు నచ్చకపోయి ఉండొచ్చని, కోహ్లీ అలా అనకుండా.. ఇంకాస్త మంచి పదాలు ఉపయోగించి ఉండాల్సిందని గవాస్కర్ తెలిపాడు. టీ20ల నుంచి తప్పుకొంటానని చెబుతూనే.. ఇకపై వన్డేలు, టెస్టులకు నాయకత్వం వహించడానికి అందుబాటులో ఉంటానని చెప్పాల్సిందని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.