
న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ 2022లో టీమిండియా రాణించడంపై భారత దిగ్గజాలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. కపిల్ దేవ్, హర్షా భోగ్లే వంటి క్రికెట్ ఎక్స్‌పర్ట్స్.. టీమిండియా గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయని నిర్మోహటంగా చెప్పారు. తాజాగా సునీల్ గవాస్కర్ సైతం అదే తరహా వ్యాఖ్యలు చేశాడు. యావత్ క్రికెట్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్- పాకిస్థాన్ హై ఓల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్దం కాగా.. లిటిల్ మాస్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆదివారం జరగనున్న ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ విజృంభిస్తుందని, స్టార్ పేసర్ షాహిన్ అఫ్రిది జట్టులోకి రావడంతో పాక్ బలం రెట్టింపు అయ్యిందని తెలిపాడు.
'షాహీన్ అఫ్రిది ఫిట్‌నెస్ విషయంలో పాక్ ఆందోళన చెందింది. సుదీర్ఘ విరామం తర్వాత అతను తిరిగి జట్టులో చేరడం వారికి కొత్త ఉత్సాహాన్నిచ్చింది. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో రెండు ఓవర్లలో తన బౌలింగ్‌తో విరుచుకుపడిన షాహీన్ అఫ్రిది.. ఫిట్‌నెస్ విషయంలోనూ మెరుగుపడ్డాడు. అతను ఫిట్‌నెస్ సాధించడంతో పాక్‌కు భారీ ఉపశమనం లభించింది. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో పాక్ ఆటగాళ్లు కనబర్చిన ప్రదర్శన కంటే మరింత మెరుగ్గా ఆడగలరు. గ్రౌండ్ ఫీల్డింగ్‌లో ఉన్న లోపాలను సైతం సవరించుకున్నారు. ఈ రెండే వారిని ఇబ్బంది పెట్టిన అంశాలు. ఇక ఆదివారం భారత్‌తో జరిగే మ్యాచ్‌లో వారు విజృంభిస్తారనడంలో సందేహం లేదు'అని గవాస్కర్ అంచనా వేశాడు.
మోకాలి గాయం కారణంగా జట్టుకు దూరమైన షాహీన్ అఫ్రిది ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌తో బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అనంతరం అఫ్గానిస్థాన్‌తో జరిగిన రెండో వార్మప్ మ్యాచ్‌లో మాత్రం తనదైన యార్కర్లతో దుమ్మురేపాడు. ఇద్దరు అఫ్గాన్ ఓపెనర్లను ఔట్ చేసిన ఈ లెఫ్ట్ హ్యాండర్ పేసర్ రెండు వికెట్లు తీశాడు. గతేడాది దుబాయ్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో షాహీన్ అఫ్రిదే భారత జట్టు ఓటమిని శాసించాడు. మరోసారి అతను కీలకం కానున్నాడు. ఇక భారత్ కూడా షాహీన్‌ను ధీటుగా ఎదుర్కొనేందుకు రెడీ అయ్యింది.