ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తుది పోరుకు రంగం సిద్దమైంది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగే ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించాలంటే కొన్ని విషయాల్లో మెరుగవ్వాలని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. తుది జట్టులో మార్పులు చేయాల్సిన అవసరం లేదని, నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని చెప్పాడు.
'ఈ టోర్నీలో ఇప్పటి వరకు టీమిండియాకు ఓపెనర్ల నుంచి సరైన ఆరంభం లభించలేదు. ఫైనల్లో ఆ లోటు తీరుస్తారని ఆశిస్తున్నా. ఓపెనింగ్ జోడీ పరుగులు చేయాల్సిన అవసరం ఉంది. బౌలింగ్‌లో కొత్త బంతితో ఆరంభంలోనే వికెట్లు తీయాలి. కనీసం 2 నుంచి 3 వికెట్లు తీస్తేనే జట్టుకు మేలు కలుగుతోంది. ఇక మిడిల్ ఓవర్లలో కూడా ఎక్కువగా వికెట్లు తీయలేదు. పరుగులు నియంత్రిస్తున్నప్పటికీ వికెట్లు తీయడంలో భారత బౌలర్లు తడబడుతున్నారు. వికెట్లు తీస్తేనే ప్రత్యర్థి మరింత ఒత్తిడికి గురవుతోంది. ఈ విభాగాల్లో టీమిండియా మెరుగవ్వాలి. అప్పుడే ఫైనల్లో విజయం సులువవుతోంది.

భారత తుది జట్టులో ఎలాంటి మార్పులు అవసరం లేదు. నలుగురు స్పిన్నర్లతో ఆడాలి. కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తీ అద్బుతంగా బౌలింగ్ చేస్తున్నారు. వారిద్దరిని ఆడించడం టీమిండియా మేనేజ్‌మెంట్ తీసుకున్న గొప్ప నిర్ణయం. వికెట్లు తీయడమే కాకుండా.. మిడిల్ ఓవర్లలో డాట్ బాల్స్ వేయడం చాలా కీలకం. ఈ విషయంలో కుల్దీప్, వరుణ్ చాలా బెటర్. గ్రూప్ స్టేజ్‌లో ఇప్పటికే న్యూజిలాండ్‌పై భారత స్పిన్నర్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. దుబాయ్ పిచ్ కూడా స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి తుది జట్టులో ఎలాంటి మార్పులు అవసరం లేదు.'అని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు.
తొలి రెండు మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన శుభ్‌మన్ గిల్ తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో విఫలయ్యాడు. ఫైనల్లోనైనా అతను భారీ స్కోర్ చేయాల్సి ఉంది. ఈ టోర్నీకి ముందు సెంచరీతో ఫామ్‌లోకి వచ్చిన రోహిత్ శర్మ.. ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. దూకుడుగా ఆడే క్రమంలో త్వరగా ఔటవుతున్నాడు. ఫైనల్లోనైనా అతను సత్తా చాటాల్సిన అవసరం ఉంది.