
సిడ్నీ: క్రికెట్‌లో 50 పరుగులు చేస్తే హాఫ్ సెంచరీ.. 100 పరుగులు చేస్తే సెంచరీ అంటారు. 200 పరుగులు సాధిస్తే డబుల్ సెంచరీగా పిలుస్తారు. అప్పుడప్పుడు డబుల్ సెంచరీని వ్యాఖ్యాతలు, విశ్లేషకులు 'డాడీ హండ్రెడ్' అని వ్యాఖ్యానిస్తుంటారు. మరి 150, 250, 300 పరుగులు చేస్తే ఏమంటారని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ తనదైన శైలిలో జవాబు ఇచ్చాడు.
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా మూడో టెస్టు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌కు గవాస్కర్ చానెల్ 7కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా ట్విటర్లో #AskSunny పేరుతో ఆ సంస్థ ప్రశ్న జవాబుల కార్యక్రమం ఏర్పాటు చేసింది. అభిమానులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సన్నీ చిలిపిగా సమాధానాలు ఇచ్చారు.
100+, 150+, 200+, 250+, 300+ పరుగులు చేస్తే ఏమంటారని ఒకరు అడగ్గా '100+ అయితే బేబీ హండ్రెడ్, 150+ అయితే టీనేజ్ హండ్రెడ్, 200+ అయితే డాడీ హండ్రెడ్, 250+ అయితే ఫాథర్ ఇన్‌లా (మామ) హండ్రెడ్, 300+ అయితే గ్రాండ్‌డాడీ (తాత) హండ్రెడ్' అని సన్నీ సమాధానమిచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్ల హల్ చల్ చేస్తోంది. ' మీ అన్ని ఇన్నింగ్స్‌ల్లో ఇష్టమైన ఇన్నింగ్స్ ఏదంటే.. '1971లో మాంచెస్టర్‌లోని ఓల్డ్‌ట్రాఫోర్డ్ వేదికగా ఇంగ్లండ్‌పై చేసిన 57 పరుగుల ఇన్నింగ్స్ నాకిష్టం. అత్యంత చలి, గాలి, పచ్చిక ఉన్న పిచ్‌పై ఆడాం' అని గవాస్కర్ గుర్తు చేసుకున్నాడు.
మాజీ క్రికెటర్ జయసింహ తనకు ఇష్టమైన, ఆదర్శంగా భావించే క్రికెటరని మరో ప్రశ్నకు బదులిచ్చారు. ఆయన బ్యాటింగ్‌ను ఎంతో ప్రేమిస్తానని, మైదానం ఆయన నడవడిక మరింత నచ్చుతుందని వెల్లడించారు. బాబార్ ఆజామ్ గురించి అడగ్గా 'అతడో విధ్వంసకర ఆటగాడు. టాప్-5 క్రికెటర్లలో కోహ్లీ, విలియమ్సన్, స్మిత్, వార్నర్‌తో పాటు అతన్ని ఎంచుకుంటా' అని సన్నీ తెలిపారు.