న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో విజేతగా నిలిచిన టీమిండియాపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. జట్టు ప్రదర్శన అద్భుతంగా ఉందని కొనియాడాడు. ఒకవేళ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో రెండు భారత జట్లు బరిలోకి దిగితే ఆ రెండు ఫైనల్ చేరుతాయని జోస్యం చెప్పాడు.
గౌహతి వేదికగా ఆదివారం జరిగిన మూడో టీ20లో టీమిండియా 8 వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే 3-0తో భారత్ కైవసం చేసుకుంది. న్యూజిలాండ్ విధించిన 154 పరుగుల లక్ష్యాన్ని 10 ఓవర్లలోనే ఛేదించింది. అభిషేక్ శర్మ(20 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 68 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్(26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో భారత విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఈ విజయం నేపథ్యంలో ఈ మ్యాచ్‌కు కామెంటేటర్స్‌గా వ్యవహరించిన సునీల్ గవాస్కర్, న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. 154 పరుగుల లక్ష్యాన్ని భారత్ 10 ఓవర్లలోనే ఛేదించడంపై సైమన్ డౌల్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. టీమిండియా బ్యాటింగ్ డెప్త్ అమోఘమని కొనియాడాడు. 'భారత్ కోరుకుంటే అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్‌లో రెండు జట్లను బరిలోకి దించవచ్చు. రెండు జట్లు ఆడినా.. ఆ రెండు టీమ్స్ కచ్చితంగా సెమీఫైనల్ చేరుతాయి. వారి వద్ద అలాంటి ప్రతిభావంతమైన ఆటగాళ్లు ఉన్నారు.'అని సైమన్ డౌల్ ప్రశంసించాడు.

సైమన్ డౌల్ వ్యాఖ్యలతో ఏకీభవించిన గవాస్కర్.. సెమీఫైనల్ కాదు.. రెండు భారత జట్లు ఫైనల్ చేరుతాయని తెలిపాడు. 'సెమీ ఫైనల్స్ కాదు.. రెండు భారత జట్లు ఫైనల్ చేరి టైటిల్ కోసం పోటీపడగలవు. భారత ప్రథమ, ద్వితీయ శ్రేణి జట్లు తలపడితే అది ప్రపంచకప్ ఫైనల్‌లానే ఉంటుంది.
కేవలం బ్యాటింగ్ మాత్రమే కాదు. ఈ మ్యాచ్‌లో భారత బౌలింగ్, ఫీల్డింగ్, క్యాచింగ్ కూడా బాగుంది. టీమిండియా ఆటతీరు అమోఘం. ఏదైనా జట్టు ఈ మ్యాచ్‌ను చూస్తే.. భారత్‌ను ఎలా ఎదుర్కోవాలా? అని ఆలోచిస్తుంది. భారత్ అసాధారణ విజయాన్ని చూసి విస్మయానికి గురవుతుంది.
అభిషేక్ అలవోకగా ఫాస్టెస్ సెంచరీలు బాదుతున్నాడు. ఒకసారి 14 బంతుల్లో.. మరోసారి 16 బంతుల్లో హాఫ్ సెంచరీలు నమోదు చేస్తున్నాడు. అతను ఏదో ఒక రోజు యువరాజ్ సింగ్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డ్‌ను అధిగమిస్తాడు. అప్పుడు అందరికంటే యువరాజ్ సింగ్ ఎక్కువ ఆనందిస్తాడు.'అని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు.