బీసీసీఐకి గవాస్కర్ బిగ్ ప్లాన్.. సచిన్, ద్రవిడ్, కుంబ్లేలను రంగంలోకి దించండి!
భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ బీసీసీఐ క్రికెట్ సలహా కమిటీ(సీఏసీ)కి సంబంధించి ఓ కీలకమైన సూచన చేశారు. సీఏసీ పని కేవలం కోచ్, సెలెక్టర్ల నియామకానికే పరిమితం కాకూడదని, భారత క్రికెట్‌కు సంబంధించిన ఇతర కీలక విషయాలలో కూడా దానికి పాత్ర ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. దులీప్ ట్రోఫీ ఫైనల్ అనంతరం గవాస్కర్ ఈ ప్రకటన చేశారు. ఆ ఫైనల్‌లో ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా వ్యవహరించిన ఈస్ట్ జోన్ జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా టైటిల్‌ను గెలుచుకుంది. దులీప్ ట్రోఫీలో ఈ నిబంధనపై గవాస్కర్ గతంలో కూడా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. 2022లో నియమితులైన ముగ్గురు సభ్యుల సీఏసీలో ప్రస్తుతం అశోక్ మల్హోత్రా, జతిన్ పరంజపే, సులక్షణ నాయక్ ఉన్నారు. హెడ్ కోచ్, సెలెక్టర్ల పదవులకు దరఖాస్తుదారులను ఇంటర్వ్యూ చేసి, ఎంపిక చేయడం ఈ కమిటీ ప్రాథమిక విధి.
సీఏసీ పరిధిని విస్తరించాల్సిన అవసరం ఉంది..
సెలక్షన్ కమిటీలు, సీఏసీ తప్ప బీసీసీఐకి ఇప్పుడు పెద్దగా ఇతర కమిటీలు లేవని సునీల్ గవాస్కర్ తన కాలమ్‌లో రాసుకొచ్చారు. తత్ఫలితంగా సీఏసీ బాధ్యతలను విస్తరించవచ్చని ఆయన పేర్కొన్నారు. మిడ్ డే పత్రికలోని తన కాలమ్‌లో ఆయన ఇలా రాసుకొచ్చారు. " ఈ రోజు బీసీసీఐకి సెలక్షన్ కమిటీలు, సీఏసీ తప్ప వేరే కమిటీలు లేవు. బహుశా సీఏసీ పరిధిని విస్తరించి కోచ్‌లు, సెలెక్టర్లను ఎంపిక చేసే బాధ్యతను, అలాగే దేశీయ, అంతర్జాతీయ మ్యాచ్‌ల షెడ్యూలింగ్, భారత క్రికెట్‌కు సంబంధించిన అన్ని విషయాలను పర్యవేక్షించే బాధ్యతను దానికి అప్పగించాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ కమిటీలో చాలా అనుభవజ్ఞులైన మాజీ క్రికెటర్లు ఉన్నారు. వారి నైపుణ్యాన్ని ఈ కమిటీలో ఉపయోగించుకోవచ్చు. " అని గవాస్కర్ అభిప్రాయపడ్డారు.

ప్రముఖుల పేర్లను సూచించిన సునీల్ గవాస్కర్
టెస్ట్ క్రికెట్‌లో 10,000 పరుగులు సాధించిన ప్రపంచపు తొలి బ్యాటర్ అయిన సునీల్ గవాస్కర్.. ఈ పాత్ర కోసం పలువురు గొప్ప మాజీ భారత క్రికెటర్ల పేర్లను కూడా సూచించారు. భారత క్రికెట్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు దిగ్గజ మాజీ క్రికెటర్ల అనుభవాన్ని వినియోగించుకోవాలని సునీల్ గవాస్కర్ కోరారు. సీఏసీ చోటు కోసం ఆయన పలువురు ప్రముఖుల పేర్లను ప్రతిపాదించారు. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, రవిశాస్త్రి, అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్ వంటి పేర్లను సునీల్ గవాస్కర్ ప్రతిపాదించారు.
సీఏసీలో దిగ్గజ ఆటగాళ్లను చేర్చుకుంటే భారత క్రికెట్ గణనీయంగా ప్రయోజనం పొందగలదని సునీల్ గవాస్కర్ భావిస్తున్నారు. పురుషుల క్రికెట్‌కే కాకుండా మహిళల క్రికెట్‌కు కూడా ఇలాంటి సలహా కమిటీని ఏర్పాటు చేయాలని గవాస్కర్ సూచించారు. ఈ కమిటీ హెడ్ కోచ్, కెప్టెన్, నేషనల్ క్రికెట్ అకాడమీ అధిపతితో సంప్రదింపులు జరిపినప్పుడు దాని మాటలకు ఎంతో బలం చేకూరుతుందన్నారు. పురుషుల క్రికెట్‌తో పాటు మహిళల క్రికెట్ పురోగతికి కూడా ఇటువంటి నైపుణ్యం, అనుభవం ఉన్న ప్రత్యేక సలహా కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలని గవాస్కరీ బీసీసీఐకి సూచించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


