టీమిండియా నుంచి అతన్ని తప్పించలేరు: సునీల్ గవాస్కర్
టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌పై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్, ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ ప్రశంసల జల్లు కురిపించారు. ఇషాన్ కిషన్ ప్రస్తుతం పరిపూర్ణ ఆటగాడిగా మారిపోయాడని అభిప్రాయపడ్డారు. సౌతాఫ్రికా వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ 2026 టోర్నీలో ఇషాన్ కిషన్ కచ్చితంగా ఆడుతాడని, ఇప్పటికే అతనికి వీసా దొరికిందని గవాస్కర్ చెప్పాడు.
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన రెండో వన్డేలో ఇషాన్ కిషన్ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరించిన గవాస్కర్.. గ్రేమ్ స్వాన్‌తో కలిసి ఇషాన్ కిషన్ ఆటను విశ్లేషిస్తూ కొనియాడాడు.
ప్రపంచకప్ బెర్త్ కన్ఫామ్..
'ఇషాన్ కిషన్‌కు ఇప్పటికే ప్రపంచకప్ వీసా దొరికిందని నేను భావిస్తున్నా. అతన్ని జట్టు నుంచి తప్పించాలంటే మరే ఆటగాడైనా ఆసాధారణ ప్రదర్శన కనబర్చాలి. ఇప్పటికే టీ20 ఫార్మాట్‌లో ఇషాన్ కిషన్ కీలక ఆటగాడిగా మారాడు. అంతేకాకుండా ప్రస్తుతం అతను చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు.

గత 18 నెలల్లో టెక్నికల్ పరంగా ఇషాన్ కిషన్ ఆటలో చాలా మార్పు వచ్చింది. ఒకప్పుడు అతన్ని ఇబ్బంది పెట్టిన సాంకేతిక లోపాలను పూర్తిగా సరిదిద్దుకున్నాడు. గ్రేమ్ స్వాన్.. ఒకసారి ఆ షాట్‌ను చూడండి. ఆ లాఫ్టెడ్ ఎక్స్‌ట్రా-కవర్ డ్రైవ్. అలాగే అతని డిఫెన్స్ కూడా చాలా బాగుంది. బంతి కాస్త షార్ట్‌గా పడితే చాలు.. అతను చాలా వేగంగా బ్యాక్ ఫుట్‌పైకి వెళ్లి దానిని సిక్సర్‌గా మలుస్తున్నాడు.
ఆట చాలా మారింది..
అతను ఇప్పుడు ఒక పరిపూర్ణమైన ఆటగాడిగా మారాడు. గత ఏడాదిన్నర కాలంలోనే అతను ఇంతటి పరిపూర్ణతను సాధించాడు. అంతకుముందు ఆఫ్ స్టంప్ వైపు వచ్చే బంతులను ఆడటంలో అతను కాస్త ఇబ్బంది పడేవాడు. అప్పట్లో అతని వద్ద ఈ లాఫ్టెడ్ ఎక్స్‌ట్రా-కవర్ డ్రైవ్ షాట్ లేదు. కానీ ఇప్పుడు అతను దానిని తన అమ్ముల పొదిలో చేర్చుకున్నాడు. అందుకే అతడిని అడ్డుకోవడం బౌలర్లకు చాలా కష్టంగా మారింది.'అని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు.
ఏ స్థానంలోనైనా ఆడగలడు..
సునీల్ గవాస్కర్ వ్యాఖ్యలతో ఏకీభవించిన గ్రేమ్ స్వాన్.. ఇషాన్ కిషన్‌ను టీమ్ మ్యాన్ అంటూ కొనియాడాడు. 'అతను ఒక అద్భుతమైన టీమ్ మ్యాన్. జట్టు అవసరాలకు తగ్గట్లు ఏ స్థానంలోనైనా ఆడుతాడు. గత మ్యాచ్‌లో మూడో స్థానంలో ఆడిన ఇషాన్ కిషన్.. తాజా మ్యాచ్‌లో నాలుగో స్థానంలో వచ్చి అదరగొట్టాడు. భారత జెర్సీ ఒంటిపై ఉన్నంత కాలం తాను ఏ నంబర్‌లో బ్యాటింగ్ చేస్తున్నాడనే విషయంతో అతనికి సంబంధం లేదు. జట్టు పరిస్థితులకు తగ్గట్లు ఆడటంలో అతను దిట్ట. మరో ఎండ్‌లో శుభ్‌మన్ గిల్ దూకుడుగా ఆడటంతో ఇషాన్ స్ట్రైక్ రొటేట్ చేశాడు. కానీ హాఫ్ సెంచరీ తర్వాత గేమ్ మార్చి చెలరేగాడు.
బౌలర్లకు పీడకలే..
ఇషాన్ దూకుడు చూసి శుభ్‌మన్ గిల్ స్లో అయ్యాడు. తీవ్రమైన ఎండలో ఈ ఇద్దరూ అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇషాన్ లెగ్ సైడ్ బాగా ఆడుతున్నాడు. షార్ట్ బాల్స్ వేస్తే విరుచుకుపడుతున్నాడు. నాకు బాగా నచ్చినవి ఎక్స్‌ట్రా కవర్ మీదుగా అతను ఆడిన షాట్స్. ఒక బ్యాటర్ కాస్త రూమ్ క్రియేట్ చేసుకొని ఎక్స్‌ట్రా కవర్ మీదుగా షాట్లు ఆడుతుంటే..బౌలర్‌కు అది ఒక పీడకల లాంటిది. ఎందుకంటే మైదానంలో రెండు వైపులా బలంగా ఆడే ఆటగాడికి బౌలింగ్ చేయడం ఎవరికైనా కష్టమే. అంత చిన్న అబ్బాయి ఎక్స్‌ట్రా కవర్ మీదుగా అంత పెద్ద సిక్సర్లు కొట్టడం నిజంగా అద్భుతం.'అని చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

