
అహ్మదాబాద్: పిచ్ విషయంలో భారత జట్టును తప్పుబట్టలమేని ఇంగ్లండ్ స్టార్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అన్నాడు. భారత్‌తో చెన్నై వేదికగా జరిగిన రెండో టెస్టులో పిచ్ అనూహ్యంగా తిరగడంపై స్పందించాడు. తమ జట్టుకు పిచ్‌ను విమర్శించే ఆలోచనే లేదని స్పష్టం చేశాడు. ఏ జట్టు అయినా స్వదేశంలో క్రికెట్ జరిగితే అనుకూల పిచ్‌లు సిద్ధం చేసుకునే హక్కు ఉంటుందని చెప్పాడు. కాబట్టి, భారత్ హోమ్ అడ్వాంటేజ్‌ను ఉపయోగించుకుంటుందని తెలిపాడు.
సెకండ్ టెస్టులో కోహ్లీసేన తమకంటే మంచి ప్రదర్శన చేసిందని, పిచ్‌ను సద్వినియోగం చేసుకొని రాణించిందన్నాడు. అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియంలో జరగనున్న పింక్ టెస్ట్ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన బ్రాడ్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ నేపథ్యంలోనే చెన్నై పిచ్‌పై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు చేసిన విమర్శలపై స్పందించాడు.
'2018లో లార్డ్స్ వేదికగా జరిగి టెస్టులోనూ మేము హోమ్ టీమ్ అడ్వాంటేజ్‌ను ఉపయోగించుకున్నాం. స్వింగ్‌కు అనుకూలంగా ఉండే పిచ్‌పై భారత్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ తక్కువ స్కోరుకే పరిమితమైంది. దాంతో తమ జట్టు ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించింది. మరోవైపు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా ఇలా ఏ జట్టును తీసుకున్నా వారి సొంత దేశాల్లో ఇలాగే చేస్తారు. అది హోమ్ అడ్వాంటేజ్'అని పేర్కొన్నాడు.
తొలి టెస్టులో విజయం సాధించిన ఇంగ్లండ్ రెండో టెస్టులో భారీ తేడాతో ఓటమి చవిచూసింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమానంగా నిలిచింది. ఇక ఈనెల 24 నుంచి మొతేరా మైదానంలో ఇరు జట్లూ మూడో మ్యాచ్ ఆడనున్నాయి. ఇది డే/నైట్ టెస్టు కావడంతో మరింత ఆసక్తి పెరిగింది.