టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ లేకుండా భారత్ వర్సెస్ ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్‌లు జరగడం ఈ సిరీస్‌కే సిగ్గు చేటని స్టార్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అన్నాడు. విరాట్ కోహ్లీ దూకుడు ప్రత్యర్థి ఆటగాళ్లకు మజాను ఇస్తుందని తెలిపాడు. వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్ట్‌లకు దూరంగా ఉన్న కోహ్లీ.. చివరి మూడు టెస్ట్‌లకు కూడా అందుబాటులోకి రాలేదు. దాంతో ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.
ప్రస్తుతం విరాట్ కోహ్లీ విదేశాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. కోహ్లీ-అనుష్క దంపతులు రెండో బిడ్డకు జన్మనివ్వనున్నారని, ప్రసవ సమయంలో ఆమె పక్కన ఉండేందుకు కోహ్లీ ఈ సిరీస్‌కు దూరంగా ఉన్నాడని సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ తెలిపాడు. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ.. తాను అబద్దం చెప్పానని, కోహ్లీ గురించి తనకు ఏం తెలియదని మాట మార్చాడు.

దాంతో అసలు కోహ్లీ దూరమవ్వడానికి గల కారణాలు ఏంటనేవి సస్పెన్స్‌గా మారాయి. కోహ్లీ గైర్హాజరీలో భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ బోరింగ్‌గా ఉందని మాజీ క్రికెటర్లతో పాటు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా జేమ్స్ అండర్సన్-కోహ్లీ మధ్య పోరును మిస్సవుతున్నామని కామెంట్ చేస్తున్నారు. హర్భజన్ సింగ్ సైతం కోహ్లీ లేకపోవడంతో టెస్ట్ సిరీస్ బోరింగ్ అనిపిస్తోందన్నాడు.
తాజాగా స్టువర్ట్ బ్రాడ్ ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. కోహ్లీ లేకపోవడం భారత్ వర్సెస్ ఇంగ్లండ్ సిరీస్‌కే సిగ్గు చేటని చెప్పాడు. 'కోహ్లీ లేకుండానే మ్యాచ్‌లు జరగడం ఈ సిరీస్‌కే సిగ్గు చేటు. కోహ్లీ అపార నైపుణ్యం కలిగిన ప్లేయర్. ఆట పట్ల అతని అంకిత భావం అద్భుతం. అతని దూకుడు ప్రత్యర్థులకూ మజాను ఇస్తోంది.
ఏదేమైనా కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత విషయాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరికైనా కుటుంబం తర్వాతే అన్నీ. అయితే కోహ్లీ జట్టులో లేకపోవడం యువ ఆటగాళ్లకు మంచి అవకాశం. అతని గైర్హాజరీలతో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటే భవిష్యత్తులో మరిన్ని ఛాన్సెస్ వస్తాయి.'అని స్టువర్ట్ బ్రాడ్ చెప్పుకొచ్చాడు.