లండన్: ఇంగ్లండ్ పేసర్ క్రిస్ వోక్స్‌పై ఆ జట్టు వెటరన్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ప్రశంసల జల్లు కురిపించాడు. క్రిస్ వోక్స్ అసాధారణమైన ఆటగాడని కొనియాడాడు. అతనంటే తన భార్య మోలీకి పిచ్చని తెలిపాడు. చివరకు అతని తర్వాతే తాను అని చెప్పిందని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ నాలుగో టెస్ట్‌కు సిద్దమవుతోంది.
క్రిస్ వోక్స్ అసాధారణ ప్రదర్శనతో మూడో టెస్ట్‌లో విజయం సాధించిన ఆ జట్టు సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. నాలుగో టెస్ట్ నేపథ్యంలో డెయిలీ మొయిలీకి రాసిన కాలమ్‌లో స్టువర్ట్ బ్రాడ్.. క్రిస్ వోక్స్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. తన సతీమణి ఫేవరేట్ క్రికెటరని చెప్పుకొచ్చాడు.

'క్రిస్ వోక్స్ అసాధారణమైన ఆటగాడు. నా సతీమణి మోలీ తన ఫేవరేట్ ప్లేయర్ క్రిస్ వోక్స్ అని చెప్పింది. వెంటనే నేను మరీ? అని అడిగాను. దానికి ఆమె.. క్రిస్ వోక్స్ తర్వాతే నువ్వు అని బదులుచ్చింది. ఇది అతనికి దక్కిన అతిపెద్ద ప్రశంస. ఇంగ్లండ్ రెండు ప్రపంచకప్స్ గెలవడంలో అతను కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా హెడింగ్లీ వేదికగా జరిగిన మూడో టెస్ట్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.'అని బ్రాడ్ రాసుకొచ్చాడు.
మార్క్ వుడ్ ఇంగ్లండ్ తుది జట్టులో ఉండాలని, అతనుంటే టీమ్ బలం పెరుగుతుందని బ్రాడ్ అభిప్రాయపడ్డాడు. బుధవారం(జూలై 19) నుంచి మాంచెస్టర్ వేదికగా జరగనున్న నాలుగో టెస్ట్‌లో ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ బరిలోకి దిగే ఇంగ్లండ్ తుది జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. రెండు రోజుల ముందుగానే ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే నాలుగో టెస్ట్ ఆడే టీమ్ వివరాలను కూడా వెల్లడించింది. తుది జట్టులో ఏకైక మార్పు మాత్రమే చేసింది. మూడు టెస్ట్‌ల్లో విఫలమైన ఓలీ రాబిన్సన్‌పై వేటు వేసిన ఇంగ్లండ్ టీమ్ మేనేజ్‌మెంట్.. అతని స్థానంలో వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్‌ను తీసుకుంది. ఇక మూడో టెస్ట్ నుంచి జేమ్స్ అండర్సన్‌కు విశ్రాంతి కల్పించిన విషయం తెలిసిందే. తొలి రెండు టెస్ట్‌ల్లో అతను మూడు వికెట్లు మాత్రమే తీసాడు.
బజ్‌బాల్ కాన్సెప్ట్‌తో దూకుడుగా ఆడుతున్న అభిమానులను అలరిస్తున్న ఇంగ్లండ్.. తొలి రెండు టెస్ట్‌ల్లో విజయం ముంగిట బోర్లా పడింది. మూడో టెస్ట్‌కు మూడు మార్పులతో బరిలోకి విజయాన్నందుకుంది. జట్టులోకి వచ్చిన మార్క్‌వుడ్, క్రిస్ వోక్స్ అసాధారణ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.