
చెన్నై: టెయిలెండర్ల అసాధారణ బ్యాటింగ్‌తోనే టీమిండియాతో మూడో వన్డేలో విజయం సాధించామని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. ఓ దశలో 220 పరుగులు కూడా చేస్తామో లేదో అనుకున్న తమ జట్టు లోయరార్డర్ రాణించడం వల్ల భారత్ ముందు 270 పరుగుల లక్ష్యాన్ని ఉంచిందని తెలిపాడు. బుధవారం జరిగిన ఆఖరి వన్డేలో సమష్టిగా చెలరేగిన ఆసీస్ 21 పరుగుల తేడాతో టీమిండియాను ఓడించింది.
ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను ఆసీస్ 2-1తో కైవసం చేసుకుంది. సిరీస్‌తో పాటు వన్డే ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్‌గా నిలిచింది. ఈ విజయానంతరం మాట్లాడిన స్టీవ్ స్మిత్.. లోయరార్డర్ రాణించడమే ఈ మ్యాచ్ టర్నింగ్ పాయింటని తెలిపాడు.
'ఇదో అద్భుతమైన పర్యటన. చాలా ఆస్వాదించాం. ఢిల్లీ టెస్ట్ తర్వాత మా జట్టు అద్భుతంగా పుంజుకుంది. పరిస్థితులకు తగ్గట్లు ఆడి విజయాలందుకుంది. చెన్నై వికెట్ చాలా భిన్నం. బ్యాటింగ్‌లో మేం కొన్ని వికెట్లను త్వరగా చేజార్చుకున్నాం. మా స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఫీల్డింగ్‌తో పాటు మా ఆటగాళ్లు సమష్టి ప్రదర్శన కనబర్చారు. టెయిలెండర్లు అసాధారణ బ్యాటింగ్‌తో పోరాడే లక్ష్యాన్ని అందించారు. టెయిలెండర్స్ రాణించకుంటే ఆసీస్ 220 పరుగులు కూడా చేసేది కాదు. లోయరార్డర్ పర్ఫామెన్సే ఈ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్'అని స్టీవ్ స్మిత్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారత బౌలర్ల ధాటికి 49 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌటైంది. ట్రావిస్ హెడ్(31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33), మిచెల్ మార్ష్(47 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 47), అలెక్స్ క్యారీ(46 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 38) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా(3/44), కుల్దీప్ యాదవ్(3/56) మూడేసి వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్(2/57), మహమ్మద్ సిరాజ్(2/37) రెండేసి వికెట్లు పడగొట్టారు.
అనంతరం లక్ష్యచేధనకు దిటిన టీమిండియా 49.1 ఓవర్లలో 248 పరుగులకే ఆలౌటై ఓటమి పాలైంది. విరాట్ కోహ్లీ(72 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 54), హార్దిక్ పాండ్యా(40 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 40)రాణించినా ఫలితం లేకపోయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా(4/45) నాలుగు వికెట్లతో భారత పతనాన్ని శాసించాడు. అష్టన్ అగర్ రెండు వికెట్లు తీయగా.. మార్కస్ స్టోయినీస్, సీన్ అబాట్ తలో వికెట్ తీసారు.