
ముంబై: బ్యాటింగ్ వైఫల్యంతోనే టీమిండియాతో తొలి వన్డేలో ఓటమిపాలయ్యామని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ (Steve Smith) తెలిపాడు. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడం విజయవకాశాలను దెబ్బతీసిందన్నాడు. శుక్రవారం ముంబై వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఆసీస్‌ను ఓడించింది. మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన స్టీవ్ స్మిత్ 250 పరుగులు చేసుంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు. ప్రతికూల పరిస్థితుల్లోనూ కేఎల్ రాహుల్ (KL Rahul), రవీంద్ర జడేజా (Ravindra Jadeja) అద్భుతంగా బ్యాటింగ్ చేశారని, తమ ఓటమిని ఈ ఇద్దరే శాసించారని తెలిపాడు. ఈ విజయానికి భారత ఆటగాళ్లు పూర్తి అర్హులని స్మిత్ కొనియాడాడు.
'వాంఖడే మైదానంలో లో- స్కోరింగ్ గేమ్ ఉంటుందని అస్సలు ఊహించలేదు. సాధారణంగా ఇక్కడ భారీ స్కోర్లు నమోదు అవుతాయి. భారత్ అద్భుతంగా బౌలింగ్ చేసింది. మేం 250 పరుగులు చేసుంటే ఫలితం మరోలా ఉండేది. స్వింగ్, సీమ్ అనుకూలంగా ఉన్న ఈ పిచ్‌పై పోటీ మరింత రసవత్తరంగా మారేది. తీవ్ర ఒత్తిడిలో కేఎల్ రాహుల్, జడేజా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. కీలక భాగస్వామ్యంతో మా ఓటమిని శాసించారు. మేం అద్భుతమైన ఆరంభాన్ని అందుకున్నాం. మిచెల్ మార్ష్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కానీ మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోయాం. జడేజా, రాహుల్.. మాదిరి ఓ భాగస్వామ్యం నెలకొల్పాల్సింది. పేసర్లకు అనుకూలంగా ఉన్న పరిస్థితుల్లో కాస్త ఓపికగా ఆడాల్సింది. ఇంకొన్ని పరుగులు చేసుంటే విజయానికి అవకాశం ఉండేది. పూర్తి క్రెడిట్ భారత్‌దే.'అని స్మిత్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 35.4 ఓవర్లలో 188 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ బ్యాటర్లలో మిచెల్ మార్ష్(65 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో 81) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో షమీ, సిరాజ్ మూడేసి వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా రెండు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్య చేధనకు దిగిన టీమిండియా 39.5 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగులు చేసి గెలుపొందింది. . కేఎల్ రాహుల్(91 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 75 నాటౌట్), రవీంద్ర జడేజా(69 బంతుల్లో 5 ఫోర్లతో 45 నాటౌట్) సూపర్ బ్యాటింగ్‌తో రాణించారు. అయితే లక్ష్యచేధనలో టీమిండియా 83 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడగా.. కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా జట్టును ఆదుకున్నారు. ఈ ఇద్దరూ 6వ వికెట్‌కు 108 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని అందించి ఓటమిని తప్పించారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీయగా.. మార్కస్ స్టోయినీస్ రెండు వికెట్లు పడగొట్టాడు.