అప్పుడు బాల్ టాంపరింగ్
గతంలో టీమిండియాపై ఆడేటప్పుడు ఎల్బీ రివ్యూ విషయంలో డ్రెస్సింగ్ రూమ్‌కు సైగ చేసి దొరికిపోయిన స్టీవ్ స్మిత్.. ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో బాల్ టాంపరింగ్‌కు పాల్పడ్డాడు. 2018లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన టెస్టులో స్మిత్ బాల్ టాంపరింగ్ వివాదం కారణంగా ఓ ఏడాది మొత్తం క్రికెట్‌కే దూరమయ్యాడు. ఆ ఘటనతో పలు దేశాల్లోని అభిమానులు అతడిపై మండిపడ్డారు. అది అభిమానుల మదిల్లోంచి ఇంకా చెదిరిపోకుండానే మళ్లీ చీటింగ్‌కు పాల్పడ్డాడు. భారత్-ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ బ్యాటింగ్ చేసే క్రమంలో స్మిత్ చీటింగ్ చేశాడు.

పంత్ గార్డ్‌ను కావాలని చెరిపేస్తూ
ఏ క్రికెటర్ అయినా బ్యాటింగ్ చేయడానికి క్రీజ్‌లోకి వెళ్లగానే.. ముందుగా తీసుకునేది గార్డ్. అది లెగ్ స్టిక్, మిడిల్ స్టిక్ అనేది బ్యాట్స్‌మన్ నిర్ణయించుకుని అంపైర్‌ను గార్డ్ కోరతాడు. మూడో టెస్టులో రిషబ్ పంత్ బ్యాటింగ్ చేసే సమయంలో గార్డ్ మార్క్‌లను స్టీవ్ స్మిత్ మార్చేశాడు. డ్రింక్స్ బ్రేక్‌లో పంత్ గార్డ్‌ను కావాలని చెరిపేస్తూ.. స్టంప్స్ కెమెరాకు అడ్డంగా దొరికిపోయాడు. తన గార్డ్ చెరిపేయడంతో పంత్ మరోసారి మార్క్ చేసుకోవాల్సి వచ్చింది. ఐదవరోజు ఆసీస్ బౌలర్లను పంత్ చితక బాదుతుంటే.. తట్టుకోలేకపోయిన స్మిత్ చిల్లరవేషాలకు పోయాడు. భారత్ మ్యాచ్ గెలుస్తుందని స్మిత్ బయపడిపోయాడు.

నిషేధానికి గురైనా స్మిత్ మారలేదుగా
స్టంప్స్ కెమెరాలో స్టీవ్ స్మిత్ పూర్తిగా కనిపించకపోయినా.. గార్డ్ మార్చింది అతననే విషయం స్పష్టంగా తెలుస్తోంది. స్మిత్ చేసిన చిల్లరపనికి సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. దీనిపై సోషల్ మీడియాలో విపరీతమైనట్రోలింగ్ నడుస్తోంది. 'స్టీవ్ స్మిత్ చిల్లరవేషాలు వేశాడు' అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. 'భారత్ మ్యాచ్ గెలుస్తుందనే స్మిత్ ఇలా చేశాడు' అని మరొకరు కామెంట్ చేశారు. 'ఏడాది బ్యాన్ పడ్డ క్రికెటర్.. మళ్లీ చీటింగ్ చేయడానికి ఏమాత్రం వెనుకాడలేదు', 'ఏడాది నిషేధానికి గురైనా స్మిత్ ఏమాత్రం మారలేదుగా', 'చీటర్స్ ఎప్పుడూ చీటర్సే' అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. స్మిత్ చేసిన ఈ పనిపై ఆస్ట్రేలియా ఫ్యాన్స్ కూడా మండిపడ్డారు. ఇదేనా నీ క్రీడాస్ఫూర్తి అంటూ ప్రశ్నించారు.

డ్రా దిశగా సిడ్నీ టెస్ట్
ఆస్ట్రేలియా నిర్దేశించిన 407 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమ్‌ఇండియా డ్రా దిశగా సాగుతోంది. ప్రధాన బ్యాట్స్‌మెన్ అంతా ఔటవ్వడంతో టెయిలెండర్లే మిగిలారు. ఈ నేపథ్యంలో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ హనుమ విహారి(6; 82 బంతుల్లో), రవిచంద్రన్ అశ్విన్(16; 61 బంతుల్లో 2x4) వికెట్ కాపాడుకుంటున్నారు. వీరిద్దరూ ఇప్పటివరకు 112 బంతులాడి కేవలం 19 పరుగులే చేశారు. భారత గెలవడానికి 25 ఓవర్లలో 116 పరుగులు చేయాలి.
ట్రక్‌ను ఢీ కొట్టిన కారు.. షోయబ్ మాలిక్‌కు తప్పిన పెను ప్రమాదం!!


Click it and Unblock the Notifications












