టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై మాజీ చీఫ్ సెలెక్టర్ క్రిష్ శ్రీకాంత్ మరోసారి విమర్శలు గుప్పించాడు. గంభీర్ ఏమనుకున్నా తనకు అనవసరమని, జట్టు సెలెక్షన్ ఏ మాత్రం బాలేదన్నాడు. ప్రతీ మ్యాచ్‌కు ఓ ప్లేయర్ అరంగేట్రం చేస్తున్నారని, ప్రయోగాల పేరిట జట్టును నాశనం చేస్తున్నారని మండిపడ్డాడు. సౌతాఫ్రికాతో గౌహతి వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా దారుణంగా విఫలమైంది. రోడ్డులాంటి బ్యాటింగ్ పిచ్‌పై భారత బ్యాటర్లు తేలిపోయారు.
ఇదే పిచ్‌పై సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగుల భారీ స్కోర్ చేస్తే.. భారత్ మాత్రం 201 పరుగులకే ఆలౌటైంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో 1-0తో వెనుకంజలో ఉన్న భారత్.. క్లీన్ స్వీప్ దిశగా సాగుతోంది. టీమిండియా వైఫల్యానికి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అనాలోచిత నిర్ణయాలే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. గంభీర్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏడాది వ్యవధిలోనే 24 మంది ప్లేయర్లు టెస్ట్ మ్యాచ్‌లు ఆడగా.. విరాట్ కోహ్లీ సారథిగా ఏడేళ్ల కాలంలో 41 మంది ప్లేయర్లు మాత్రమే సుదీర్ఘ ఫార్మాట్ ఆడారు. ఈ గణంకాలే ఆటగాళ్లతో గంభీర్ ఎలా మ్యూజికల్ చైర్ ఆడుతున్నాడనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

ఇలా తరుచూ మార్పులు చేయడం జట్టుకు నష్టం చేస్తుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా టీమ్ మార్పులపై స్పందించిన క్రిష్ శ్రీకాంత్.. గంభీర్ తీరుపై మండిపడ్డాడు. సౌతాఫ్రికాతో రెండో టెస్ట్‌కు నితీష్ కుమార్ రెడ్డిని తీసుకోవడం ఘోర తప్పిదమని విమర్శించాడు. అసలు అతను ఆల్‌రౌండరే కాదని స్పష్టం చేశాడు.
'ప్రతీ ప్రత్యామ్నాయ మ్యాచ్‌లో ఎవరో ఒకరు అరంగేట్రం చేస్తున్నారు. ప్రయోగం చేసి విఫలమయ్యామని గంభీర్ చెప్పవచ్చు. కానీ నేను మాత్రం పట్టించుకోను. గంభీర్ ఏమనుకున్నా నాకు అనవసరం. నేను మాజీ కెప్టెన్. మాజీ చీఫ్ సెలెక్టర్‌ను. నేను ఏ విషయం గురించి మాట్లాడుతున్నానో నాకు బాగా తెలుసు. నేనేం ఊహించి మాట్లాడటం లేదు. జట్టులో నిలకడ అనేది అనవసరం.
అసలు నితీష్ కుమార్ రెడ్డిని ఆల్‌రౌండర్ అని ఎవరు అంటున్నారు. అతని బౌలింగ్‌ను చూసి ఎవరైనా ఆల్‌రౌండర్ అని పిలుస్తారా? అతను మెల్‌బోర్న్‌లో సెంచరీ చేశాడు. ఆ తర్వాత ఒక్క ఇన్నింగ్స్ కూడా సరిగ్గా ఆడలేదు. ఒక్క ఇన్నింగ్స్ శాశ్వతం కాదు కదా? నితీష్ రెడ్డి ఆల్‌రౌండర్ అయితే నేను అతని కంటే గొప్ప ఆల్‌రౌండర్‌ను.
అతని బౌలింగ్‌లో స్వింగ్, పేస్ ఉండదు. అతను డేంజరస్ బ్యాటర్ కూడా కాదు. పచ్చిగా మాట్లాడితే నితీష్ కుమార్ రెడ్డికి భారత జట్టులో ఆడే అర్హతే లేదు. అతను ఎలా జట్టులోకి వచ్చాడో అర్థం కావడం లేదు. హార్దిక్ పాండ్యాకు అతను ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదు. అక్షర్ పటేల్‌నే ఆడించాల్సింది. 'అని క్రిష్ శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడాడు.