న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు టీమిండియా స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయంతో దూరమవ్వగా.. అతని స్థానంలో ఢిల్లీ ప్లేయర్ ఆయుష్ బదోనిని సెలెక్టర్లు ఎంపిక చేశారు. అయితే ఈ ఎంపికను మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తప్పుబట్టాడు. ఇది సరైన ఎంపిక కాదని విమర్శించాడు. దేశవాళీ క్రికెట్‌లో అతని ప్రదర్శన మెరుగ్గా లేకున్నా..ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించాడు.
'ఒకరి విషయంలో పరుగులు చేస్తేనే జట్టులో చోటు అంటున్నారు. మరొకరి విషయంలో మాత్రం పరుగులు చేయకున్నా జట్టులోకి తీసుకుంటున్నారు. ఐపీఎల్‌లో బదోని ఆడిన అద్భుత ఇన్నింగ్స్ ఏదైనా ఉంటే చెప్పండి. ఐపీఎల్ ప్రదర్శనను వన్డేలకు ప్రామాణికంగా తీసుకోకూడదు. అతను కేవలం మూడు వికెట్లు తీసుకున్నంత మాత్రాన ఆల్‌రౌండర్ అవుతాడా? అతను ఐపీఎల్‌లో ఎన్నిసార్లు బౌలింగ్ చేశాడు. అతను బౌలింగ్ చేయడం ఎవరైనా చూశారా?'అని క్రిష్ శ్రీకాంత్ సెలెక్టర్లను ప్రశ్నించాడు.

రుతురాజ్ గైక్వాడ్ ఏం పాపం చేశాడని కూడా శ్రీకాంత్ నిలదీసాడు. 'గత వన్డే సిరీస్‌లో రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ చేశాడు. కానీ అతన్ని ఎంపిక చేయలేదు. అతను ఏం తప్పు చేశాడు? ఒక వేళ ఆల్‌రౌండర్ అవసరమైతే అక్షర్ పటేల్‌ను తీసుకోవాల్సింది.'అని శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు.
లిస్ట్ ఏ క్రికెట్‌లో ఆయుష్ బదోని కనీసం 1000 పరుగులు కూడా చేయలేదని, అతని ఖాతాలో వికెట్లు కూడా ఎక్కువగా లేవని ఆకాశ్ చోప్రా విమర్శించాడు. నితీష్ కుమార్ రెడ్డిని జట్టులోకి తీసుకోని అవకాశాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించాడు. అతన్ని చివర్లో బ్యాటింగ్‌కు పంపించడం, కొన్ని ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయించడం సరికాదన్నాడు.
అయితే ఈ విమర్శలకు టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ సమాధానమిచ్చాడు. భారత్-ఏ తరఫున మెరుగైన ప్రదర్శన చేయడంతోనే బదోనిని తీసుకున్నామని స్పష్టం చేశాడు. ఐపీఎల్‌లోనూ అతను మెరుగ్గా రాణించాడని గుర్తు చేశాడు. బదోని జట్టులోకి వచ్చిన న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో అతనికి అవకాశం దక్కలేదు. సుందర్ స్థానంలో నితీష్ రెడ్డిని ఆడించారు.