
దుబాయ్: ఆఖరి బంతికి సిక్స్ కొట్టి జట్టును గెలిపించడం ప్రత్యేక అనుభూతినిచ్చిందని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ కేఎస్ భరత్ తెలిపాడు. ఈ సంతోషాన్ని మాటల్లో వర్ణించలేనని చెప్పాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో శుక్రవారం జరిగిన ఉత్కంఠ పోరులో కేఎస్ భరత్ సూపర్ సిక్స్‌తో ఆర్‌సీబీ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. కీలక ప్లే ఆఫ్స్ ముందు తమ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపుచేసుకుంది. మూడో స్థానంతో ప్లేఆఫ్స్ చేరిన ఆర్‌సీబీ సోమవారం జరిగే ఎలిమినేటర్‌లో కోల్‌కతాను ఢీకొననుంది.
మ్యాచ్‌లో ఆర్‌సీబీ గెలవాలంటే ఆఖరి బంతికి సిక్స్ కొట్టాలి. సినిమాల్లో హీరో అయితే చాలా అవలీలగా సిక్స్ బాదేస్తాడేమో.. కానీ అలాంటి ఉత్కంఠభరిత క్షణాల్లో సిక్స్ కొట్టడం అంత సులువేం కాదు. తేలికైన ప్రత్యర్థి ఎదురుగా ఉన్నా.. అనుభవం ఎంత ఉన్నా ఆఖరి బంతికి సిక్స్ కొట్టి జట్టును గెలిపించడం అంటే మాటలు కాదు. అలాంటిది ఈ సీజన్‌లో అత్యధిక విజయాలతో అగ్రస్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ లాంటి బలమైన జట్టుపై ఆ ఫీట్ చేయడమంటే అద్భుతమే. ఆ అద్భుతాన్ని అందుకుని ఔరా అనిపించాడు తెలుగు కుర్రాడు కేఎస్ భరత్. అజేయ హాఫ్ సెంచరీతో ఆర్‌సీబీకి చిరస్మరణీయ విజయాన్నందించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు.
మ్యాచ్ అనంతరం ఈ విజయంపై స్పందించిన కేఎస్ భరత్.. తన బ్యాటింగ్ ప్రదర్శన పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. ఇక ఏదీ ప్రీగా రాదని, కష్టపడితేనే ఫలితం దక్కుతుందని చెప్పుకొచ్చాడు. బ్యాటింగ్‌లో రాణించేందుకు చాలా కష్టపడ్డానని తెలిపాడు. 'చివరి బంతికి సిక్స్ కొట్టి విజయాన్నందుకోవడం గొప్ప అనుభూతినిచ్చింది. ఇలా జట్టును గెలిపించడం థ్రిల్లింగ్‌గా ఉంది. ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేను. మ్యాక్స్‌వెల్, నేను సమయోచితంగా బ్యాటింగ్ చేశాం. ఏ దశలో కూడా నేను నర్వస్ అవ్వలేదు. ప్రస్తుతం గురించే ఆలోచిస్తూ వైడ్ తర్వాత ఆఖరి బంతి కోసం ఎదురు చూశా. స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు నేను సిద్దమయ్యా. ప్రత్యేకంగా దృష్టిపెట్టా. ఏది ఉచితంగా రాదనేది నా సిద్దాంతం. నా కష్టాన్ని నమ్ముకొంటాను'అని కేఎస్ భరత్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 164 పరుగులు చేసింది. ఓపెనర్లు పృథ్వీ షా(31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48), శిఖర్ ధావన్(35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43) రాణించారు. ఆర్‌సీబీ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్(2/25) రెండు వికెట్లు తీయగా.. యుజ్వేంద్ర చాహల్, హర్షల్ పటేల్, డాన్ క్రిస్టియన్ తలో వికెట్ తీశారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 166 పరుగులు చేసింది. కేఎస్ భరత్ (52 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 78 నాటౌట్), మ్యాడ్ మ్యాక్సీ(33 బంతుల్లో 8 ఫోర్లతో 51 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఢిల్లీ బౌలర్లలో అన్రిచ్ నోర్జ్ రెండు, అక్షర్ పటేల్ ఓ వికెట్ తీశాడు.