బుడ్డోడి కోసం గంట వెయిట్ చేసిన శ్రీలంక దిగ్గజం!(వీడియో)
టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ కోసం శ్రీలంక దిగ్గజం అనుర టెన్నెకూన్ గంట పాటు వెయిట్ చేశాడు. ముక్కోణపు వన్డే సిరీస్ కోసం భారత్-ఏ జట్టుతో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ శ్రీలంక పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. మంగళవారం దంబుల్లాలోని రంగిరి అంతర్జాతీయ స్టేడియంలో శ్రీలంక-ఏతో హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో భారత్-ఏ సూపర్ ఓవర్‌లో ఓటమిపాలైంది.
డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లంతా తీవ్రమైన చర్చలో మునిగిపోయి ఉండగా.. బయట మాత్రం డెబ్బై ఏళ్ల అనుర టెన్నెకూన్.. 15 ఏళ్ల వైభవ్ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. శ్రీలంక తొలి వన్డే కెప్టెన్, ఆ దేశం ఎంతగానో గౌరవించే క్రికెట్ దిగ్గజం అనుర టెన్నెకూన్.. వైభవ్ సూర్యవంశీని చూసేందుకే కొలంబో నుంచి దంబుల్లాకు వచ్చాడు. ఈ మ్యాచ్ ఓటమి బాధతో పాటు శ్రీలంక ఆటగాళ్లతో గొడవపడిన బాధలో ఉన్న వైభవ్ సూర్యవంశీ..టెన్నెకూన్‌ను కలుసుకున్నాడు.

తరానికి ఒక్కడు..
ఆయనను చూడగానే బాధలో ఉన్నట్లు కనిపించిన వైభవ్ సూర్యవంశీకి హుషారు వచ్చింది. వెంటనే టెన్నెకూన్ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు. వెంటనే టెన్నెకూన్, వైభవ్‌ను ఆప్యాయంగా పైకి లేపి ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వైభవ్ సూర్యవంశీపై శ్రీలంక దిగ్గజం ప్రశసల జల్లు కురిపించారు. 'వైభవ్ తరానికి ఒక్కడొచ్చే అద్భుతమైన ప్రతిభావంతుడు.'అని కొనియాడారు.
వాళ్లిద్దరి మధ్య సంభాషణ కొద్దిసేపే సాగింది. కానీ, టెన్నెకూన్ మాటలు వైభవ్‌కు ఎంతో ధైర్యాన్నిచ్చాయి. 'బయటి విషయాల గురించి పట్టించుకోకుండా నీ ఆటపై దృష్టి పెట్టు. ఈ రోజు నువ్వు ఆడలేకపోయావు. కానీ, అది ఆటలో భాగమే. ప్రతీ రోజూ మనం రాణించలేం కదా' అని టెన్నెకూన్ హితవు పలికారు. ఆయన మాటలను వైభవ్ మౌనంగా వింటూ తల ఊపుతూ కనిపించాడు.
15 ఏళ్ల బాలుడి కోసం 70 ఏళ్ల వ్యక్తి
'ఐపీఎల్‌లో వైభవ్ బ్యాటింగ్ నన్ను బాగా ఆకట్టుకుంది. అతను కొట్టే సిక్సర్లు, ఫోర్లు అద్భుతం. ఇదే ఫామ్ కొనసాగించాలని కోరుకుంటున్నాను.' అని టెన్నెకూన్ తెలిపారు. ప్రస్తుతం ఈ సంభాషణకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. ఒక అంతర్జాతీయ దిగ్గజం, డెబ్బై ఏళ్ల వయసులో, ఓటమి బాధలో ఉన్న ఒక టీనేజ్ ఆటగాడికి ధైర్యం చెప్పడానికి గంట సేపు వేచి చూడటం నిజంగా గొప్ప విషయమని నెటిజన్లు కొనియాడుతున్నారు. భారత్-ఏ టీమ్ కెప్టెన్ తిలక్ వర్మ కూడా టెన్నెకూన్‌తో కాసేపు ముచ్చటించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

