
దుబాయ్: ఆసియాకప్ 2022 ఫైనల్లో పాకిస్థాన్ ముందు శ్రీలంక 171 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. 58 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును భానుక రాజపక్స(45 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 71 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 170 పరుగులు చేసింది. రాజపక్సకు అండగా హసరంగా(21 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 36)రాణించాడు. ఈ ఇద్దరు 6వ వికెట్లకు 58 పరుగులు జోడించారు. పాకిస్థాన్ బౌలర్లలో హరీస్ రౌఫ్ మూడు వికెట్లు తీయగా.. నసీమ్ షా, షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్ తలో వికెట్ తీసారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. నసీమ్ షా వేసిన ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్‌లోనే ఓపెనర్ కుశాల్ మెండీస్(0) గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. నసీమ్ షా ఇన్‌స్వింగర్‌కు కుశాల్ మెండీస్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ధనంజయ డిసిల్వా బౌండరీలతో ఎదురు దాడికి దిగాడు. అయితే హరీస్ రౌఫ్.. పాతుమ్ నిస్సంక(8)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చి కోలుకోలేని దెబ్బతీసాడు. తన మరుసటి ఓవర్‌లో గుణతిలకను కూడా హరిస్ రౌఫ్ ఔట్ చేయడంతో లంక పవర్ ప్లేలో46 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ కొద్ది సేపటికే క్రీజులో సెట్ అయిన ధనుంజయ డిసిల్వా(28)ను ఇఫ్తికర్ అహ్మద్ రిటర్న్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు.
క్రీజులోకి వచ్చిన కెప్టెన్ డసన్ షనక(2) కూడా షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో లంక 58 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. కనీసం 100 పరుగులైనా చేస్తుందా? అనిపించింది. కానీ క్రీజులోకి వచ్చిన హసరంగాతో కలిసి భానుక రాజపక్స జట్టును ఆదుకున్నారు. స్పిన్నర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించిన ఈ జోడీ వేగంగా పరుగులు రాబట్టింది. 6వ వికెట్‌కు 58 పరుగులు జోడించిన అనంతరం హసరంగాను హారిస్ రౌఫ్ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. మరోవైపు రాజపక్స మాత్రం తన జోరు కొనసాగించాడు. హరీస్ రౌఫ్ వేసిన 18వ ఓవర్‌లో రాజపక్స ఇచ్చిన క్యాచ్‌ను షాదాబ్ నేలపాలు చేశాడు. దాంతో అతను క్విక్ సింగిల్‌తో 35 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 19వ ఓవర్‌లో సిక్స్ బాదిన రాజపక్స..4, 6 బాది జట్టుకు 170 పరుగుల భారీ స్కోర్ అందించాడు.