కొలంబో: ప్రస్తుతం వర్షం జోరు కొనసాగుతోంది. ప్రతీ క్రికెట్ మ్యాచ్‌కు వరణుడు అడ్డంకిగా మారుతున్నాడు. యాషెస్ సిరీస్ లో భాగంగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్‌కు అంతరాయం కలిగించి ఫలితం తేలకుండా చేసిన వరణుడు.. వెస్టిండీస్-భారత్ రెండో టెస్ట్‌ను కూడా డ్రా చేశాడు. తాజాగా శ్రీలంక-పాకిస్థాన్ రెండో టెస్ట్‌కు అంతరాయం కలిగించాడు.
సోమవారం ఈ మ్యాచ్ ప్రారంభం కాగా.. వర్షం కారణంగా రెండో రోజు ఆటకు అంతరాయం కలిగింది. 10 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. భారీ వర్షం కారణంగా ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారడం.. ఆకాశాన్ని మబ్బులు కమ్మేయడంతో వెలుతురు లేకపోవడంతో అంపైర్లు రెండో రోజు ఆటను ముగించేసారు.
145/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన పాకిస్థాన్.. వర్షంతో ఆట ఆగిపోయే సమయానికి 2 వికెట్లకు 178 పరుగులు చేసింది. 10 ఓవర్లలో 33 పరుగులు చేసింది. క్రీజులో అబ్దుల్లా షఫీఖ్(87 బ్యాటింగ్), కెప్టెన్ బాబర్ ఆజామ్(28 బ్యాటింగ్) ఉన్నారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 48.4 ఓవర్లలో 166 పరుగులకు కుప్పకూలింది. యువ పేసర్ నసీమ్ షా(3/41) నిప్పులు చెరగగా.. స్పిన్నర్ అబ్రర్ అహ్మద్(4/69) బంతితో శ్రీలంక బ్యాటర్లను చెడుగుడు ఆడాడు. శ్రీలంక బ్యాటర్లలో ధనంజయ డి సిల్వా(68 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 57), దినేశ్ చండిమల్(60 బంతుల్లో 4 ఫోర్లతో 34) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం అందుకొని ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించాలని భావించిన పాకిస్థాన్ ప్రణాళికపై వరణుడు నీళ్లు జల్లాడు. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్ గెలిచి 1-0తో ఆధిక్యంలో ఉన్న పాకిస్థాన్.. రెండో టెస్ట్‌లోనూ విజయం సాధించి సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేయాలనుకుంటోంది.
డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్‌లో భాగంగా ఈ సిరీస్ జరుగుతుండటంతో విజయమే లక్ష్యంగా పాకిస్థాన్ బరిలోకి దిగింది. 2-0తో సిరీస్ కైవసం చేసుకుంటే డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో పాక్ అగ్రస్థానం చేరనుంది.