
కొలంబో: శ్రీలంక పర్యటనను ఇంగ్లండ్ విజయవంతంగా ముగించిన విషయం తెలిసిందే. సోమవారం ముగిసిన రెండో టెస్ట్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ఇంగ్లండ్.. 6 వికెట్ల తేడాతో గెలుపొంది రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ సరదా ఘటన చోటు చేసుకుంది. శ్రీలంక నిర్దేశించిన 164 పరుగుల విజయ లక్ష్యాన్ని చేధించేందుకు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించగా.. ఆ జట్టు వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ జానీ బెయిర్‌స్టో కొట్టిన ఓ భారీ సిక్సర్‌కు బంతి పనికిరాకుండా పోయింది.
శ్రీలంక బౌలర్ రమేశ్ మెండీస్ వేసిన 10వ ఓవర్ తొలిబంతిని బెయిర్ స్టో రివర్స్ స్వీప్ షాట్ ఆడగా బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి డీప్ ఓవర్ ఫైన్ లెగ్ మీదుగా బౌండరీ ఫెన్స్ బయట ఉన్న కలర్ బకెట్‌లో పడింది. బంతికి రంగు అంటడంతో అది పనికిరాకుండా పోయింది. దాంతో అంపైర్లు మరో బంతిని తెప్పించి ఆటను కొనసాగించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మెనా? మజాకా? అని భారత అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇక ఐపీఎల్‌లో బెయిర్ స్టో.. డేవిడ్ వార్నర్ సారథ్యంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. తదుపరి సీజన్ కోసం కూడా సన్‌రైజర్స్ అతన్ని రిటైన్ చేసుకుంది.
ఇక శ్రీలంక నిర్దేశించిన 164 పరుగుల విజయ లక్ష్యాన్ని ఇంగ్లండ్ 43.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. డామ్ సిబ్లీ (56 నాటౌట్), జాస్ బట్లర్ (46) ఐదో వికెట్‌కు అజేయంగా 75 పరుగులు జోడించి మరో రోజు ఆట మిగిలిఉండగానే జట్టుకు విజయాన్నందించారు.
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 339/9తో నాలుగోరోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్ మరో 5 పరుగులు జోడించి 344 పరుగుల వద్ద ఫస్ట్ ఇన్నింగ్స్‌ను ముగించింది. దీంతో శ్రీలంకకు 37 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంకను ఇంగ్లండ్ స్పిన్నర్లు డామ్ బెస్ (4/49), జాక్ లీచ్ (4/59), జో రూట్ (2/0) దెబ్బతీశారు.
ఈ ముగ్గురి ధాటికి లంక 35.5 ఓవర్లలో 126 పరుగులకే ఆలౌటైంది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు ఇంగ్లండ్ పేసర్లు తీయగా... రెండో ఇన్నింగ్స్‌లోని 10 వికెట్లను స్పిన్నర్లు తీయడం విశేషం. అజేయ శతంకంతో రాణించిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్‌కు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'తో పాటు 'ప్లేయర్ ఆఫ్ ద సిరీస్'అవార్డులు లభించాయి.