అందుకే రాహుల్, గిల్.. మూడు ఫార్మాట్లలో రాణిస్తున్నారు: తిలకరత్నే దిల్షాన్
ఆధునిక అంతర్జాతీయ క్రికెట్ పరిస్థితులపై శ్రీలంక దిగ్గజ క్రికెటర్ తిలకరత్నే దిల్షాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 ఫార్మాట్‌తో క్రికెట్ విస్తరణ జరిగినప్పటికీ.. టెస్ట్ క్రికెట్‌కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించాడు. టీ20 బ్యాటింగ్ తీరును మార్చేసిన దిల్‌స్కూప్ షాట్ సృష్టికర్త అయిన దిల్షాన్.. మా మైఖేల్ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు కేఎల్ రాహుల్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు.
టీ20 ఫార్మాట్ రాకతో ఆధునిక క్రికెట్ శైలిలో ఎలాంటి మార్పులు వచ్చాయంటారు?
దిల్షాన్: గతంలో వన్డేల్లో 250 పరుగులు దాటితే విజయం ఖాయమనుకునేవారు. కానీ ఇప్పుడు 300 పరుగులు చేసినా విజయంపై నమ్మకం లేదు. టీ20 ఫార్మాట్ ఆటగాళ్ల ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసింది. ఈ రోజుల్లో ఫార్మాట్‌కు తగ్గట్లు బ్యాటర్లు తమ ఆట శైలిని వేగంగా మార్చుకోవాల్సి వస్తోంది. అయితే క్రికెట్ అమెరికా, కెనడా వంటి సరికొత్త దేశాలకు వ్యాపించడానికి కూడా ఈ ఫార్మాట్ ఎంతగానో ఉపయోగపడింది. ప్రేక్షకులకు వినోదం పంచడానికి ఇది ఎంతో అద్భుతమైన వేదికగా నిలిచింది.
ఒకే క్రికెటర్ మూడు ఫార్మాట్లలో రాణించడం ఎంతవరకు సాధ్యం? భారత ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ప్రదర్శనను మీరెలా చూస్తారు?
దిల్షాన్: టెస్ట్, వన్డే మ్యాచ్‌ల ద్వారానే ఆటగాడి నైపుణ్యాన్ని అంచనా వేయగలం. మూడు ఫార్మాట్లలో రాణించడం అంత సులువు కాదు. కానీ శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ వంటి బ్యాటర్లు ఫార్మాట్‌కు తగ్గట్లు తమ బ్యాటింగ్ శైలిని మార్చుకుంటున్నారు. అందుకే ఈ ఇద్దరూ మూడు ఫార్మాట్లలో సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో చాలా దేశాలు వేర్వేరు ఫార్మాట్లకు ప్రత్యేక జట్లను, కెప్టెన్లను ఎంపిక చేయడానికి కూడా ఇదే ప్రధాన కారణం.
టెస్ట్ క్రికెట్ భవిష్యత్తుపై మీ అభిప్రాయం ఏంటి? వివిధ లీగ్‌ల ప్రభావం రెడ్ బాల్ ఫార్మాట్‌పై పడుతోందా?
దిల్షాన్: అవును.. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు టెస్ట్ క్రికెట్ మనుగడకు ప్రశ్నార్థకంగా మారాయి. వివిధ లీగ్‌ల వల్ల ఆటగాళ్ళు చాలా త్వరగా రిటైర్ కావడం దురదృష్టకరం. క్రికెట్ బోర్డులు టెస్ట్ ఫార్మాట్‌పై ఖచ్చితంగా పెట్టుబడులు పెట్టాలి. టీ20ల్లో పరుగులు చేయడం కంటే టెస్ట్‌లలో సత్తా చాటడం చాలా కష్టం. ఈ సుదీర్ఘ ఫార్మాట్ సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.

మైదానంలో బ్యాటర్లు సృజనాత్మక షాట్లు ఆడుతున్న తరుణంలో బౌలర్లు ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి?
దిల్షాన్: బ్యాటర్లు సృజనాత్మక షాట్లు ఆడుతున్న తరుణంలో బౌలర్లు కేవలం స్థిరమైన లెంగ్త్‌ను మాత్రమే నమ్ముకుంటే కుదరదు. మైదానంలో ఎప్పటికప్పుడు సరైన ప్రాక్టికల్ నిర్ణయాలు తీసుకోగల బౌలర్లే మ్యాచ్ విజేతలుగా నిలుస్తారు. ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన పోరాటాలను ఇప్పటికే ప్రత్యక్షంగా వీక్షించాం.
భారత దేశవాళీ క్రికెట్ గురించి మీ అభిప్రాయం ఏంటి..?
దిల్షాన్: టీమిండియా సక్సెస్ సీక్రెట్ పటిష్టమైన దేశవాళీ క్రికెట్. అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న సూర్యకుమార్ యాదవ్ వంటి టాప్ క్లాస్ ప్లేయర్లు కూడా తమ అనుబంధ రాష్ట్ర జట్ల తరఫున స్థానిక టోర్నీల్లో ఆడుతున్నారు. ఈ విధానం అత్యుత్తమమైన నాయకులను తయారు చేయడానికి దోహదపడుతుంది.
ప్రస్తుతం భారత్‌తో ఉన్న వనరులతో ఒకే సమయంలో అంతర్జాతీయ స్థాయిలో పోటీపడగల మూడు. నాలుగు జట్లను తయారు చేయవచ్చు. మాజీ క్రికెటర్లు కూడా చాలా కృషి చేస్తున్నారు. మా దేశంలో కూడా ప్రతిభావంతులకు కొరత లేదు. కానీ వారిని సానబట్టే సరైన ప్రణాళికలు కావాలి.
మహిళల క్రికెట్ ఎదుగుదలను మీరెలా చూస్తారు? అలాగే శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు ప్రదర్శన గురించి ఏం చెప్తారు?
దిల్షాన్: గత కొన్నేళ్లుగా మహిళల పోటీతత్వం పురుషుల మ్యాచ్‌లతో సమానంగా దూసుకుపోతోంది. ప్రస్తుతం కొన్ని జట్లు మాత్రమే ఆధిపత్యం చలాయించే పరిస్థితి లేదు. సౌతాఫ్రికా, శ్రీలంక, పాకిస్థాన్ జట్లు కూడా గట్టి పోటీనిస్తున్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్ వంటి జట్లకు గట్టి సవాల్ విసురుతున్నాయి.
శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు ఒంటిచేత్తో లంక జట్టును విజయంగా నడిపిస్తోంది. దేశంలో మంచి స్పిన్నర్లు కూడా సిద్ధంగా ఉండటం వల్ల లంక మహిళల జట్టు ఈ ప్రతిష్టాత్మక ఐసీసీ టోర్నీలో సత్తా చాటుతుందని నమ్ముతున్నాను. నా కుమార్తె కూడా లంక అండర్-19 జట్టు తరఫున రాణిస్తుండటం గర్వకారణం. వారు త్వరలోనే భారత్‌లో శిక్షణ తీసుకోనున్నారు.
బిగ్ క్రికెట్ లీగ్ (BCL) వంటి టోర్నీలు యువ ఆటగాళ్లకు ఎలాంటి అవకాశాలను అందిస్తాయి?
దిల్షాన్: ఎంతోమంది ఔత్సాహిక దేశీయ ఆటగాళ్లకు ఈ టోర్నీ మంచి గుర్తింపు తెచ్చిపెడుతోంది. విదేశీ స్టార్లు, సీనియర్ క్రికెటర్లతో కలిసి ఆడటం వల్ల వారి మానసిక ధైర్యం పెరుగుతుంది. ఈ పోటీల నియమాల ప్రకారం ఔత్సాహిక క్రీడాకారులకు కచ్చితంగా ప్రధాన అవకాశాలు ఇవ్వాలి. దీనివల్ల వారికి కౌంటీ మ్యాచులు ఆడే లక్కీ ఛాన్స్ దక్కుతుంది.
యువ క్రీడాకారులు మీతో ఎలాంటి విషయాలు చర్చిస్తూ ఉంటారు? వారి నైపుణ్యం మెరుగవడానికి ఈ లీగ్ ఎలా సహాయపడుతుంది?
దిల్షాన్: యువ ఆటగాళ్లు ఎప్పుడూ నాతో మాట్లాడి సందేహాలను నివృత్తి చేసుకుంటూ ఉంటారు. ఒత్తిడితో కూడిన క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో.. బ్యాటింగ్, బౌలింగ్ నైపుణ్యాలను ఎలా మెరుగుపరుచుకోవాలో తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. మైదానంలో, వెలుపల అంతర్జాతీయ ఆటగాళ్ల ప్రవర్తన చూసి చాలా విషయాలు నేర్చుకుంటారు. క్రీడలో చాలా చిన్న విషయాలే అద్భుతమైన మార్పులు తెస్తాయి, ఈ అనుభవాన్ని వారు తమ స్థానిక సహచరులతో పంచుకుంటారు.
చివరిగా.. క్రికెట్ కాకుండా శ్రీలంకలో ఇతర క్రీడా విభాగాల్లో రాణిస్తున్న వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందా?
దిల్షాన్: కచ్చితంగా ఉంది. దేశంలో క్రికెట్‌కు లభించే స్పందన, ఆర్థిక సాయం మిగిలిన క్రీడాకారులకు కూడా సమానంగా అందించాలి. లంక జావెలిన్ త్రోయర్ రమేష్ పతిరాగే అంతర్జాతీయ స్థాయిలో అద్భుత రికార్డులు నమోదు చేశాడు. దేశంలో వారికి సరైన ఆర్థిక సహాయం అందిస్తే మరిన్ని ఒలింపిక్ పతకాలు సాధిస్తారు.
యువ ప్రతిభావంతులకు అనుకూలమైన వాతావరణం కల్పించడం ద్వారా ప్రపంచ క్రీడా పటంలో శ్రీలంక తన స్థాయిని పెంచుకుంటుంది. సరైన మార్గదర్శకత్వంలో ఎదిగే నవతరం క్రీడాకారులు ఎన్నో కీర్తి శిఖరాలను అధిరోహిస్తారని, రాబోయే రోజుల్లో దేశానికి మరిన్ని గౌరవాలు తెస్తారని నా గట్టి నమ్మకం.’అని తిలకరత్నే దిల్షాన్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

