ఏసీసీ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024 టోర్నీ ఫైనల్లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ పోరు చూడాలనుకున్న అభిమానులకు నిరాశే ఎదురైంది. ఈ టోర్నీలో పాకిస్థాన్-ఏ పోరాటం ముగిసింది. శ్రీలంక-ఏతో శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో పాకిస్థాన్-ఏ 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. పేలవ బ్యాటింగ్ ఆ జట్టు కొంపముంచితే.. సమష్టి ప్రదర్శన శ్రీలంకకు విజయాన్నందించింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్-ఏ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 135 పరుగులు చేసింది. ఓపెనర్ ఒమైర్ యూసఫ్(46 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 68) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. మరే బ్యాటర్ కూడా 20 పరుగులు చేయలేదు. శ్రీలంక బౌలర్లలో దుషాన్ హేమంత(4/21) నాలుగు వికెట్లు తీయగా.. నిపున్ రన్సికా, ఇషాన్ మలింగా తలో రెండు వికెట్లు తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన శ్రీలంక-ఏ 16.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసి సునాయస విజయాన్ని అందుకుంది. అహన్ విక్రమసింఘే(46 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 52 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో శ్రీలంక-ఏ విజయంలో కీలక పాత్ర పోషించాడు. లాహిరు ఉడానా(20 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 43) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పాకిస్థాన్ బౌలర్లలో సుఫియన్ ముఖీమ్, అబ్బాస్ అఫ్రిది తలో వికెట్ తీసారు.
భారత్ వర్సెస్ అఫ్గానిస్థాన్ మధ్య జరిగే రెండో సెమీఫైనల్లో గెలిచే జట్టుతో శ్రీలంక ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఒకవేళ పాకిస్థాన్ ఫైనల్‌కు వచ్చి.. రెండో సెమీఫైనల్లో భారత్ గెలిచి ఉంటే అభిమానులకు ఫైనల్ రూపంలో బ్లాక్ బాస్టర్ మ్యాచ్ చూసే అవకాశం దక్కేది. ఏ స్థాయి అయినా.. మరే క్రీడ అయినా.. భారత్ X పాక్ పోరుకు ఉన్న క్రేజ్ ప్రత్యేకం. యావత్ ప్రపంచం దాయాదుల పోరుపై ఆసక్తి కనబరుస్తోంది.
ఈ టోర్నీ లీగ్ దశలో భారత్-పాకిస్థాన్ తలపడగా.. తిలక్ సారథ్యంలోని భారత్-ఏ విజయం సాధించింది. లీగ్ దశలో పాకిస్థాన్, యూఏఈ, ఓమన్ దేశాలను వరుసగా మట్టికరిపించిన భారత్ సెమీఫైనల్-2లో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.
భారత కుర్రాళ్ల టీమ్‌లో కెప్టెన్ తిలక్ వర్మతో పాటు స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ, అన్షుల్ కంబోజ్, ఆయుష్ బదోని సూపర్ ఫామ్‌లో ఉన్నారు. అన్షుల్ కంబోజ్ సంచలన బౌలింగ్‌తో పాకిస్థాన్‌పై విజయాన్ని అందిస్తే.. యూఏఈపై అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. ఓమన్‌పై ఆయుష్ బదోనీ చెలరేగాడు.