సన్‌రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్, జార్ఖండ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో మణిపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ 64 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. మొత్తం 78 బంతుల్లో 16 ఫోర్లు, 6 సిక్స్‌లతో 134 పరుగులు చేశాడు.
ఇషాన్ కిషన్ విధ్వంసంతో జార్ఖండ్ ఈ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. గ్రూప్-ఏలో భాగంగా సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన మణిపూర్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 253 పరుగులు చేసింది. జాన్సన్ సింగ్(69), కంగబమ్(43) టాప్ స్కోరర్లుగా నిలిచారు. జార్ఖండ్ బౌలర్లలో అనుకుల్ రాయ్, ఉత్కర్ష్ సింగ్ రెండేసి వికెట్లు తీయగా.. వికాష్ సింగ్, సుప్రియో చక్రబోర్టీ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యఛేదనకు దిగిన జార్ఖండ్ ఇషాన్ కిషన్ విధ్వంసంతో 28.3 ఓవర్లలో 2 వికెట్లకు 255 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ఇషాన్ కిషన్‌తో పాటు ఉత్కర్ష్ సింగ్(64 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 68) హాఫ్ సెంచరీతో రాణించాడు. మణిపూర్ బౌలర్లలో కిషణ్ సింగా 2 వికెట్లు పడగొట్టాడు.
మానసిక సమస్యలతో టీమిండియాకు దూరమైన ఇషాన్ కిషన్ ఫామ్‌లోకి వచ్చాడు. దేశవాళీ క్రికెట్‌లో వరుస టోర్నీల్లో శతకాల మోత మోగిస్తున్నాడు. బుచ్చి బాబు టోర్నీలో శతక్కొట్టిన ఇషాన్ కిషన్.. దులీప్ ట్రోఫీలోనూ సెంచరీ సాధించాడు. రంజీ ట్రోఫీలోనూ సెంచరీ బాదిన ఇషాన్ కిషన్.. విజయ్ హజారే ట్రోఫీలోనూ అదే జోరు కొనసాగించాడు. దాంతో ఇషాన్ కిషన్ అతి త్వరలోనే టీమిండియాలోకి పునరాగమనం చేస్తారని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
ఇషాన్ కిషన్ సంచలన బ్యాటింగ్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అప్‌కమింగ్ సీజన్‌లోనూ ఇషాన్ కిషన్ ఇదే జోరు కనబరిస్తే ఆరెంజ్ ఆర్మీకి తిరుగుండదని కామెంట్ చేస్తున్నారు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఇషాన్ కిషన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 11.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.