లండన్: యాషెస్ సిరీస్ కంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఆడటం చాలా కష్టమని ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ అన్నాడు. ఐపీఎల్‌లో మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్ట్‌లో హ్యారీ బ్రూక్(91 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 85) హాఫ్ సెంచరీతో రాణించాడు.
దాంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 54.4 ఓవర్లలోనే 283 పరుగులు చేసింది. తొలి రోజు ఆట అనంతరం అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన హ్యారీ బ్రూక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

టెస్ట్ క్రికెట్‌పై అభిమానులకు ఆసక్తి పెంచేందుకే ఇంగ్లండ్ బజ్‌బాల్ కాన్సెప్ట్‌ను ఎంచుకుందని హ్యారీ బ్రూక్ తెలిపాడు. 'ఇంగ్లండ్ టెస్ట్ టీమ్ బజ్ బాల్ కాన్సెప్ట్‌ను ఎంచుకుంది జట్టు విజయం కోసం.. సిరీస్‌లు సాధించడానికి కాదు. టెస్టు క్రికెట్ చూసే జనాలను అలరించేందుకు ఈ కాన్సెప్ట్‌తో దూకుడుగా ఆడుతోంది.
టెస్ట్ మ్యాచ్‌లకు తిరిగి ప్రాణం పోయడానికి గతేడాదిగా ఇంగ్లండ్ టీమ్ ప్రయత్నిస్తోంది. ఈ విషయంలో ఇంగ్లండ్ టెస్టు టీమ్ సక్సెస్ అయ్యిందనే భావిస్తున్నా. బజ్‌బాల్ బ్యాటింగ్ కారణంగా టెస్ట్ క్రికెట్ చూసేందుకు జనం ఆసక్తి చూపిస్తున్నారు. మేం ఇంకా యాషెస్ సిరీస్‌ను కోల్పోలేదు. ఆస్ట్రేలియా కేవలం రిటైన్ మాత్రమే చేసుకుంది.
చివరి టెస్టులో మేం గెలిస్తే, సిరీస్ డ్రా అవుతోంది. మేం సునాయసంగా గెలవాల్సిన నాలుగో టెస్ట్ వర్షం కారణంగా డ్రాగా ముగిసింది. అయితే చివరి మ్యాచ్‌లో గెలిచి 2-2 తేడాతో సిరీస్‌ని డ్రా చేయగలమనే నమ్మకం మాకు ఉంది. గత మ్యాచ్‌లో మేం పూర్తి ఆధిపత్యం చెలాయించాం. ఆఖరి మ్యాచ్‌లో విజయం సాధిస్తే సిరీస్ రాకపోయినా... నైతికంగా విజయం సాధిస్తాం.'అని హారీ బ్రూక్ చెప్పుకొచ్చాడు.
'యాషెస్ సిరీస్ ఆడటం వల్ల మానసికంగా.. భౌతికంగా ఏమైనా ఒత్తిడికి గురవుతున్నారా?'అని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు హారీ బ్రూక్ తనదైన శైలిలో బదులిచ్చాడు. వాస్తవానికి యాషెస్ సిరీస్ కంటే ఐపీఎల్ ఆడటం మానసికంగా శారీరకంగా చాలా కష్టమని బదులిచ్చాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో రూ.13.25 కోట్ల భారీ ధరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేయగా అతను దారుణంగా విఫలమయ్యాడు.
కేవలం ఒకే ఒక సెంచరీ చేసి అభిమానుల నుంచి తీవ్ర ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ ఆడటం మానసికంగా ఇబ్బందని తెలిపాడు.
ఇప్పటి వరకు 10 టెస్టులు ఆడిన హ్యారీ బ్రూక్, 64.25 సగటుతో 1028 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం. అయితే హ్యారీ బ్రూక్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న ఫ్లాట్ వికెట్స్, పేస్ బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌లపై మాత్రమే ఆడుతాడనే అపవాదు ఉంది.