
దుబాయ్: సంజూ శాంసన్(57 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 82) హాఫ్ సెంచరీతో రాణించడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందు రాజస్థాన్ రాయల్స్ 165 పరుగుల పోరాడే లక్ష్యాన్ని ఉంచింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. శాంసన్ హాఫ్ సెంచరీకి తోడుగా యశస్వీ జైస్వాల్(23 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 36), మహిపాల్ లోమ్‌రోర్(28 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 29 నాటౌట్) రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో సిద్దార్థ్ కౌల్ రెండు వికెట్లు తీయగా.. సందీప్ శర్మ, భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. భువనేశ్వర్ కుమార్ వేసిన ఇన్నింగ్స్ సెకండ్ ఓవర్‌లోనే ఓపెనర్ ఎవిన్ లూయిస్(6) క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. దాంతో ఆరంభంలోనే క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సంజూ శాంసన్.. మరో ఓపెనర్ యశస్వీ జైస్వాల్‌తో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. జైస్వాల్ స్వేచ్చగా ఆడటంతో శాంసన్ పని సులువైంది. ఇక సందీప్ శర్మ వేసిన మూడో ఓవర్‌లో జైస్వాల్ రెండు బౌండరీలు బాదగా.. భువీ నాలుగో ఓవర్‌లో శాంసన్ బౌండరీతో టచ్‌లోకి వచ్చాడు. ఆ తర్వాత ఈ ఇద్దరు పోటాపడి బౌండరీలు బాదడంతో రాజస్తాన్ పవర్ ప్లే ముగిసేసరికి వికెట్ నష్టానికి 49 రన్స్ చేసింది.
ఆ తర్వాత సందీప్ శర్మ వేసిన 9వ ఓవర్‌లో భారీ సిక్సర్‌తో జోరు కనబర్చిన జైస్వాల్.. ఆ మరుసటి బంతికే బౌల్డ్ అయ్యాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 56 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే లివింగ్ స్టోన్‌ను రషీద్ పెవిలియన్ చేర్చాడు. ఇక క్రీజులోకి వచ్చిన మహిపాల్ లోమ్రార్‌తో సంజూ శాంసన్ చెలరేగాడు. సిద్దార్త్ కౌల్ వేసిన 16 ఓవర్ తొలి బంతిని మిడాఫ్ దిశగా బౌండరీ బాది హాఫ్ సెంచరీ బాదాడు. అనంతరం మరో రెండు సిక్స్‌లు బాది 20 రన్స్ పిండుకున్నాడు. ఆ తర్వాత కూడా ఈ జోడీ ఆడపాదడపా బౌండరీలు బాదింది. అయితే సిద్దార్థ్ కౌల్ వేసిన లాస్ట్ ఓవర్‌లో శాంసన్, రియాన్ పరాగ్ ఔటవ్వడంతో నాలుగు పరుగులు మాత్రమే వచ్చాయి.