
దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్‌లో తమ తొలి మ్యాచ్‌కు విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సిద్దమైంది. మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ సారథ్యంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఇరు జట్లకూ ఇదే తొలి మ్యాచ్ కావడం... విధ్వంసం సృష్టించే ఆటగాళ్లకు కొదవలేకపోవడంతో అభిమానులకు అసలైన ఐపీఎల్ మజా అందనుంది.
అయితే ఈ మ్యాచ్‌కు ముందు ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీని ఓ అరుదైన రికార్డు ఊరిస్తుంది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ విజయం సాధిస్తే.. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా విరాట్ విజయాల సంఖ్య 50కి చేరుతుంది. తద్వారా ఈ ఘనత సాధించిన నాలుగో కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీ, గౌతమ్ గంభీర్, రోహిత్ శర్మ సరసన నిలుస్తాడు.
13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో 105 విజయాలతో చెన్నై సూపర్ కింగ్స్ సారథి ధోనీ టాప్‌లో ఉండగా.. కోల్‌కతా నైట్ రైడర్స్ మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ 71 విజయాలతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక 60 విజయాలతో రోహిత్ మూడో కెప్టెన్‌గా నిలిచాడు. 2011 నుంచి ఆర్‌సీబీని నడిపిస్తున్న కోహ్లీ.. 100 మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేయగా.. 49 మ్యాచ్‌ల్లో బెంగళూరు విజయం సాధించింది. రోహిత్ నాలుగుసార్లు, ధోనీ మూడుసార్లు, గంభీర్ రెండుసార్లు టైటిళ్లు గెలవగా.. కోహ్లీ సేన మాత్రం ఇప్పటి వరకూ కప్ గెలవలేకపోయింది.
గతంతో పోలిస్తే బెంగళూరు జట్టు ఈసారి సమతూకంగా బలంగా కనిపిస్తోంది. అంతా తానై నడిపించే కోహ్లీకి ఆస్ట్రేలియా విధ్వంసక ఆటగాడు ఆరోన్ ఫించ్ తోడయ్యాడు. యువ ఓపెనర్ దేవదత్ పడిక్కల్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి. వీరికి తోడు 'మిస్టర్ 360' ఏబీ డివిలియర్స్, శివమ్ దూబే, క్రిస్ మోరిస్ బ్యాట్ ఝళిపిస్తే ఆర్‌సీబీకి తిరుగుండదు. బౌలింగ్‌లో ఎప్పటిలాగే స్పిన్నర్ యజువేంద్ర చహల్ కీలకం కానున్నాడు. వాషింగ్టన్ సుందర్, పవన్ నేగి, ఆడమ్ జంపా, మొయిన్ అలీ స్పిన్ బాధ్యతల్ని మోయనున్నారు. అయితే డెత్ ఓవర్లలో తేలిపోయే బలహీనతను అధిగమించకపోతే ఆర్‌సీబీ ఎంత పోరాడినా వృథాయే. జట్టు నిండా స్టార్లతో కూడిన ఆర్‌సీబీకి ఆవగింజంత అదృష్టం తోడైతే టైటిల్ సాధించడం కష్టమేమీ కాదు.