SRH vs PBKS:కొంప ముంచిన బ్యాటింగ్ వైఫల్యం! జాసన్ హోల్డర్ పోరాడినా సన్‌రైజర్స్‌కు దక్కని విజయం!

షార్జా: ఐపీఎల్ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. పంజాబ్ కింగ్స్‌తో ఆఖరి బంతివరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 5 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. జాసన్ హోల్డర్(29 బంతుల్లో 5 సిక్స్‌లతో 47 నాటౌట్) ఒంటరిపోరాటం చేసినా ఫలితం లేకపోయింది. టాపార్డర్, మిడిలార్డర్ కట్టకట్టుకొని విఫలమవ్వడం సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయవకాశాలను దెబ్బతీసింది. హోల్డర్‌కు అండగా ఏ ఒక్కరు నిలబడ్డా ఫలితం మరోలా ఉండేది. ఇక పంజాబ్ కింగ్స్ తమకు అలవాటైన విధానంలోనే థ్రిల్లింగ్ విజయాన్నందుకుంది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవరల్లో 7 వికెట్లకు 125 పరుగులు మాత్రమే చేసింది. ఎయిడెన్ మార్క్‌రమ్(32 బంతుల్లో 2 ఫోర్లతో 27), కేఎల్ రాహుల్( 21 బంతుల్లో 3 ఫోర్లతో 21) టాప్‌సోరర్లుగా నిలిచారు. మిగతా బ్యాట్స్‌మన్ అంతా దారుణంగా విఫలమయ్యారు. హైదరాబాద్ బౌలర్లలో జాసన్ హోల్డర్(3/19) పంజాబ్ కింగ్స్ పతనాన్ని శాసించగా.. సందీప్ శర్మ, భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్, అబ్దుల్ సమద్ తలో వికెట్ తీశారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 120 పరుగులు మాత్రమే చేసింది. జాసన్ హోల్డర్, వృద్దిమాన్ సాహా(37 బంతుల్లో ఫోర్‌తో 31) టాప్ స్కోరర్లుగా నిలిచారు. పంజాబ్ బౌలర్లలో(3/24) మూడు వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ(2/14) రెండు వికెట్లు తీశాడు. అర్షదీప్ సింగ్ ఓ వికెట్ పడగొట్టాడు. లో స్కోరింగ్ గేమ్ అయినా అభిమానులను ఆఖరి బంతి వరకు మునివేళ్లపై నిలబెట్టింది.

శుభారంభం లేదు..
126 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్‌లోనే స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్(2) కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. మహమ్మద్ షమీ వేసిన ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ బాల్‌ను వెంటాడిన వార్నర్ మూల్యం చెల్లించుకున్నాడు. ఈ పరిస్థితుల్లో ఆదుకుంటాడుకున్న కేన్ విలియమ్సన్ కూడా షమీ బౌలింగ్‌లోనే వెనుదిరిగాడు.
షమీ వేసిన మరుసటి ఓవర్‌లోనే కేన్ మామ కట్ బౌల్డ్ అయ్యాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన మనీశ్ పాండే(13)తో మరో ఓపెనర్ వృద్దిమాన్ సాహా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఈ జోడీ పూర్తిగా డిఫెన్స్‌కు పరిమితమవ్వడంతో స్కోర్ బోర్డు మందగించింది. దాంతో పవర్‌ప్లేలో సన్‌రైజర్స్ 2 వికెట్లకు 20 పరుగులు మాత్రమే చేసింది.

రవి బిష్ణోయ్ దెబ్బ..
ఇక పవర్ ప్లే అనంతరం రవిబిష్ణోయ్‌ని రంగంలోకి దింపిన కేఎల్ రాహుల్ ఫలితాన్ని రాబట్టాడు. మనీశ్ పాండేను క్లీన్ బౌల్డ్ చేసిన రవి బిష్ణోయ్ సన్‌రైజర్స్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కేదార్ జాదవ్, అబ్దుల్ సమద్‌లను ఓకే ఓవర్‌లో పెవిలియన్ చేర్చాడు. ముందుగా కేదార్ జాదవ్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన రవి బిష్ణోయ్.. ఆ తర్వాత అబ్దుల్ సమద్‌ను ఊరించే బంతితో క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు.
అయితే క్రీజులోకి వచ్చిన జాసన్ హోల్డర్ మూడు భారీ సిక్స్‌లతో సన్‌రైజర్స్ శిబిరంలో ఆశలు రేకెత్తించాడు. అయితే అనవసరం పరుగుకు ప్రయత్నించిన వృద్దిమాన్ సాహా రనౌట్‌గా పెవిలియన్ చేరాడు. దాంతో రషీద్ ఖాన్ క్రీజులకి రాగా మ్యాచ్ ఉత్కంఠగా మారింది.

ఆఖరి బంతి వరకు..
చివరి మూడు ఓవర్లలో హైదరాబాద్ విజయానికి 30 పరుగులు అవసరం కాగా.. షమీ బౌలింగ్ హోల్డర్ భారీ సిక్సర్‌తో 9 పరుగులు పిండుకున్నాడు. అయితే అర్షదీప్ సింగ్ వేసిన 19వ ఓవర్ తొలి బంతికే రషీద్ ఖాన్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. దాంతో ఈ ఓవర్‌లో కేవలం 4 పరుగులు మాత్రమే వచ్చాయి. దాంతో సన్‌రైజర్స్ విజయానికి ఆఖరి ఓవర్‌లో 17 పరుగులు అవసరమయ్యాయి.
చివరి ఓవర్ నాథన్ ఎల్లిస్ వేయగా.. ఫస్ట్ బాల్‌కు సింగిల్ భువీ సింగీల్ తీయగా.. హోల్డర్ స్ట్రైక్‌లోకి వచ్చాడు. ఇక సెకండ్ బాల్‌ను భారీ సిక్సర్‌గా మలిచిన హోల్డర్.. మూడో బంతికి పరుగు తీయలేదు. ఆ మరుసటి బంతిని ఎల్లిస్ ఓ వైడ్ వేయగా.. మ్యాచ్ మరింత ఉత్కంఠగా మారింది. ఆ తర్వాత క్విక్ డబుల్ తీయగా.. ఆఖరి బంతికి సన్‌రైజర్స్ విజయానికి 7 పరుగులు అవసరమయ్యాయి. అయతే సింగిలే రావడంతో పంజాబ్ కింగ్స్ విజయం లాంఛనమైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications