ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు మరో విజయాన్ని సాధించింది. వరుసగా 4 పరాజయాల తర్వాత తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ దుమ్మురేపింది. శనివారం ఉప్పల్ వేదికగా జరిగిన హైస్కోరింగ్ గేమ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. అభిషేక్ శర్మ(55 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్స్‌లతో 141) విధ్వంసకర శతకంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 245 పరుగుల భారీ స్కోర్ చేసింది. శ్రేయస్ అయ్యర్(36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 82) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. ప్రభ్‌సిమ్రాన్ సింగ్(23 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 42), ప్రియాన్ష్ ఆర్య(13 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 36) రాణించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో హర్షల్ పటేల్(4/42) నాలుగు వికెట్లు తీయగా.. ఇషాన్ మలింగా(2/45) రెండు వికెట్లు పడగొట్టాడు.

అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.3 ఓవర్లలో 2 వికెట్లకు 247 పరుగులు చేసి గెలుపొందింది. అభిషేక్ శర్మతో పాటు ట్రావిస్ హెడ్(37 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66) హాఫ్ సెంచరీతో రాణించాడు. హెన్రీచ్ క్లాసెన్(14 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 21 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ చెరో వికెట్ తీసారు. ఈ మ్యాచ్‌లో మొత్తం 30 సిక్సర్లు.. 44 బౌండరీలు నమోదయ్యాయి.
కొంపముంచిన నోబాల్
భారీ లక్ష్యచేధనలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అదిరిపోయే ఆరంభం దక్కింది. తొలి ఓవర్‌లోనే ట్రావిస్ హెడ్ రెండు బౌండరీలు బాదగా.. మార్కో జాన్సెన్ వేసిన రెండో ఓవర్‌లో అభిషేక్ శర్మ నాలుగు బౌండరీలు బాది 19 పరుగులు పిండుకున్నాడు. ఇద్దరూ పోటాపడి బౌండరీలు బాదడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్కోర్ బోర్డు పరుగెత్తింది. అయితే యశ్ ఠాకూర్ వేసిన నాలుగో ఓవర్‌లో వరుసగా 4, 6 బాదిన అభిషేక్ శర్మ నాలుగో బంతికి క్యాచ్ ఔటయ్యాడు. పెవిలియన్ వైపు నడిచిన అభిషేక్ శర్మను అంపైర్ వెనక్కి పిలిచి ఆ బంతిని నోబాల్‌గా ప్రకటించాడు.
యశ్ ఠాకూర్.. ఫుట్ నోబాల్ వేయడంతో అభిషేక్ శర్మ బతికిపోయాడు. అప్పటికే అభిషేక్ శర్మ చేసింది 28 పరుగులే. ఈ అవకాశంతో అతను ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ ఇద్దరి ధాటికి సన్‌రైజర్స్ పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 83 పరుగులు చేసింది. లాకీ ఫెర్గూసన్ గాయంతో మైదానం వీడాడు. మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో బౌండరీ బాదిన అభిషేక్ శర్మ 19 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
40 బంతుల్లో సెంచరీ..
అభిషేక్ శర్మ ఇచ్చిన రెండు కష్టతరమైన క్యాచ్‌లను యుజ్వేంద్ర చాహల్ నేలపాలు చేశాడు. ఈ అవకాశాలతో అభిషేక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మరోవైపు ట్రావిస్ హెడ్ కూడా దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. చాహల్ బౌలింగ్‌లో బౌండరీ బాదిన అతను 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చాహల్ మరుసటి బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదిన హెడ్.. ఆ మరుసటి బంతికే క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 171 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
క్రీజులోకి క్లాసెన్ రాగా.. ఇదే ఓవర్ ఆఖరి బంతికి సింగిల్ తీసి అభిషేక్ శర్మ 40 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వెంటనే తన జేబులో నుంచి ఓ పేపర్ తీసి అభిమానులకు చూపించాడు. 'ఈ సెంచరీ ఆరెంజ్ ఆర్మీకి అంకితం'అని ఆ పేపర్‌పై రాసి ఉంది. అనంతరం మరింత దూకుడుగా ఆడిన అతను లక్ష్యాన్ని చిన్నది చేశాడు. శ్రేయస్ అయ్యర్ బౌలర్లు మార్చినా.. ఫీల్డ్ సెటప్ మార్చినా ఫలితం దక్కలేదు. చివరకు విజయం ముంగిట అభిషేక్ శర్మను అర్ష్‌దీప్ సింగ్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 51 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్‌తో కలిసి క్లాసెన్ విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.