హైదరాబాద్: రెండేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌కు ఐపీఎల్‌లో ఆడే అవకాశం లభించింది. ఐపీఎల్ 2021 సీజన్‌లో ముంబై ఇండియన్స్.. అర్జున్ టెండూల్కర్‌ను రూ.20 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. కానీ ఆ సీజన్‌లో ఒక్క మ్యాచ్‌లో అవకాశం కల్పించలేదు.
ఐపీఎల్ 2022 మెగావేలంలో రూ.30 లక్షలకు అర్జున్‌ను కొనుగోలు చేసిన ముంబై మళ్లీ బెంచ్‌కే పరిమితం చేసింది. ఈ సీజన్‌లోనూ అతన్ని కొనసాగించిన ముంబై ఇండియన్స్.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అవకాశం ఇచ్చింది. సచిన్ కొడుకు అనే ఒక్క క్వాలిఫికేషనే అర్జున్ టెండూల్కర్‌కు అవకాశాలు తెచ్చిపెట్టాయని నెటిజన్లు ట్రోలింగ్‌కు దిగారు. సినిమా రంగంలోనే కాకుండా క్రీడా రంగంలోనూ నెపోటిజమ్ కొనసాగుతుందని మండిపడ్డారు.

సాధారణ అభిమానులే కాకుండా క్రికెట్ విశ్లేషకులు కూడా అర్జున్ ఎంపికను తప్పుబట్టారు. అతని కంటే మెరుగ్గా రాణించే ఆటగాళ్లు దేశంలో చాలా మంది ఉన్నారని విమర్శించారు. కేకేఆర్‌తో తొలి మ్యాచ్‌లో 2 ఓవర్లు మాత్రమే వేసిన అర్జున్ 18 పరుగులే ఇచ్చాడు. పవర్ ప్లేలోనే బౌలింగ్ చేయడం.. కొత్త బంతితో కాస్త స్వింగ్ అవ్వడం అర్జున్‌కు కలిసొచ్చింది. పొదుపుగా బౌలింగ్ చేసినా.. అతని రనప్, బౌలింగ్ వేగంపై సోషల్ మీడియా వేదికగా జోకులు పేలాయి.
రన్నప్ ఏమో వరల్డ్ బెస్ట్ ఫాస్ట్ బౌలర్‌లా ఉందని, బౌలింగ్ వేగం మాత్రం స్పిన్నర్ల కంటే తక్కువగా ఉందని నెటిజన్లు సెటైర్లు పేల్చారు. అతను పేస్ బౌలింగ్ వేయడం కంటే స్పిన్ వేయడం ఉత్తమమని విమర్శించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లోనూ అర్జున్ టెండూల్కర్ పవర్ ప్లేలోనే రెండు ఓవర్లు వేసాడు. హారీ బ్రూక్, మాయంక్ అగర్వాల్ షాట్లు ఆడకుండా లైన్ లెంగ్త్‌తో ఇబ్బంది పెట్టాడు. మొత్తం 2.5 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ పడగొట్టాడు.
ఐపీఎల్‌లో ఖాతా తెరిచిన అర్జున్ టెండూల్కర్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురిసింది. నెపోటిజమ్ అంటూ విమర్శించిన వారికి చెంప పెట్టులా అర్జున్ రాణించడని, తన ప్రదర్శనతో నోళ్లు మూయించారని సచిన్ ఫ్యాన్స్ రచ్చ చేశారు. పెద్ద పెద్ద సెలెబ్రిటీలు సైతం అర్జున్‌ను మెచ్చుకున్నారు. పంజాబ్ కింగ్స్ కో ఓనర్ ప్రీతి జింతా అయితే.. అర్జున్‌ను చాలామంది నెపోటీజమని ఎగతాళి చేశారని, ఈ మ్యాచ్‌లో తన సత్తా ఏంటో చూపించాడని ట్వీట్ చేశారు.
అయితే అర్జున్ టెండూల్కర్‌కు అపారమైన ప్రతిభ ఉందని చాటి చెప్పే ప్రయత్నం జరుగుతుందని కొందరు వాదిస్తున్నారు. టాలెంట్ ఉంటే అతనే నిరూపించుకుంటాడని, కానీ ఇలా ఇతరులు చెప్పాల్సిన పనిలేదని విమర్శిస్తున్నారు. అర్జున్ టాలెంటెడ్ బౌలర్ అయితే మిడిల్ ఓవర్లలో ఎందుకు బౌలింగ్ ఇవ్వలేదని, ముఖ్యంగా హెన్రీచ్ క్లాసెన్, ఎయిడెన్ మార్క్‌రవ్ వంటి బిగ్ హిట్టర్లు ఉన్నప్పుడు అతనితో బౌలింగ్ ఎందుకు చేయించలేదని ప్రశ్నిస్తున్నారు.
ముంబై ఇండియన్స్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా.. హెన్రీచ్ క్లాసెన్, ఎయిడెన్ మార్క్‌రమ్ వంటి బిగ్ హిట్టర్లు క్రీజులో ఉన్నా.. డిఫెండ్ చేయడానికి పరుగులు తక్కువగా ఉన్నా.. చివరి ఓవర్‌ను అర్జున్ టెండూల్కర్‌కు ఇచ్చేవారా? అని ప్రశ్నిస్తున్నారు. భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే వంటి టెయిలెండర్లు ఉండటంతోనే రోహిత్ శర్మ.. అర్జున్ టెండూల్కర్‌కు చివరి ఓవర్ ఇచ్చారని విమర్శిస్తున్నారు.
అతనికి నిజంగానే టాలెంట్ ఉంటే తాము కూడా సంతోషిస్తామని, కానీ పనిగట్టుకొని అవకాశాలు ఇస్తూ.. సోషల్ మీడియాలో సుద్దపూస మాటలు మాట్లాడటం సరికాదని సూచిస్తున్నారు.