సన్‌రైజర్స్ హైదరాబాద్ చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ నమోదు చేసింది. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన సన్‌రైజర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 277 పరుగుల భారీ స్కోర్ చేసింది.
సన్‌రైజర్స్ బ్యాటర్లు ట్రావిస్ హెడ్(24 బంతుల్లో 9 ఫోర్లు 3 సిక్స్‌లతో 62), అభిషేక్ శర్మ(23 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 63), హెన్రీచ్ క్లాసెన్(34 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 80 నాటౌట్) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. ఎయిడెన్ మార్క్‌రమ్(28 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 42 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో హార్దిక్ పాండ్యా, కోయిట్జీ, పియూష్ చావ్లా తలో వికెట్ తీసారు.
సన్‌రైజర్స్ నమోదు చేసిన ఈ భారీ స్కోర్.. ఐపీఎల్‌లోనే కాకుండా ఫ్రాంచైజీ క్రికెట్‌లోనే హయ్యెస్ట్ స్కోర్ కావడం విశేషం. ఈ క్రమంలో ఆరెంజ్ ఆర్మీ 11 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. 2013లో ఆర్‌సీబీ నమోదు చేసిన 263/5 స్కోర్ ఇప్పటి వరకు అత్యధికంగా ఉండగా.. తాజా ఇన్నింగ్స్‌తో సన్‌రైజర్స్ అధిగమించింది.

బౌండరీల వర్షం..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఓపెనర్ ట్రావిస్ హెడ్ విధ్వంసకర బ్యాటింగ్‌తో అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. మయాంక్ అగర్వాల్(11) విఫలమైనా.. అభిషేక్ శర్మతో కలిసి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. భారీ సిక్సర్లతో 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
దాంతో పవర్ ప్లేలోనే సన్‌రైజర్స్ వికెట్ నష్టానికి 81 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఇది హయ్యెస్ట్ పవర్ ప్లే స్కోర్.ట్రావిస్ హెడ్‌ను కోయిట్జీ ఔట్ చేసినా.. అభిషేక్ శర్మ భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.
పియూష్ చావ్లా, కోయిట్జీ బౌలింగ్‌ను చీల్చి చెండాడిన అతను 16 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.తద్వారా ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు.
క్లాసెన్ కాక ఊర మాస్ బ్యాటింగ్..
అభిషేక్ శర్మను పియూష్ చావ్లా ఔట్ చేయగా.. హెన్రీచ్ క్లాసెన్ చెలరేగాడు. భారీ సిక్సర్లతో ముంబై బౌలర్లను చెడుగుడు ఆడాడు. మరో ఎండ్‌లో ఎయిడెన్ మార్క్‌రమ్ సైతం రాణించడంతో 15 ఓవర్లలోనే సన్‌రైజర్స్ 200 పరుగుల మార్క్‌ను అందుకుంది.
మరోవైపు క్లాసెన్ 23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం మరింత ధాటిగా ఆడిన అతను జట్టుకు భారీ స్కోర్ అందించాడు.