ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున 200 మ్యాచ్‌ల ఘనతను అందుకున్నాడు. ఈ ఫీట్ సాధించిన తొలి ముంబై ఇండియన్స్ ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌తో రోహిత్ శర్మ ఈ ఫీట్ సాధించాడు.
2011లో ముంబై ఇండియన్స్ జట్టులో చేరిన రోహిత్ శర్మ 2013 నుంచి 2023 వరకు ఆ జట్టుకు సారథ్యం వహించాడు. తన కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్‌ను ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలబెట్టాడు. 2013, 2015, 2017, 2019, 2020 సీజన్లలో రోహిత్ సారథ్యంలో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ టైటిల్స్ గెలిచింది.

ఓవరాల్‌గా ఒకే జట్టు తరఫున 200 ఐపీఎల్ మ్యాచ్‌ల మైలురాయిని అందుకున్న మూడో ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. రోహిత్ శర్మ కన్నా ముందు ఆర్‌సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ ఈ ఫీట్ సాధించారు. ఓవరాల్‌గా రోహిత్ శర్మకు ఇది 245వ ఐపీఎల్ మ్యాచ్.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ రోహిత్ శర్మను 200 నెంబర్ జెర్సీతో సత్కరించింది. టీమ్ మెంటార్ సచిన్ టెండూల్కర్.. రోహిత్ శర్మ ఫీట్‌ను అభినందిస్తూ జెర్సీని అందజేశాడు.
ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ముంబై ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్యా తెలిపాడు. ఇరు జట్లలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ముంబై ఇండియన్స్ జట్టులో లూక్ వుడ్ స్థానంలో 17 ఏళ్ల సంచలనం మఫక జట్టులోకి రాగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో జయదేవ్ ఉనాద్కత్, ట్రావిస్ హెడ్ బరిలోకి దిగారు.