హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ కొంచెం డ్రైగా ఉండటంతో పాటు డ్యూ వచ్చే అవకాశం ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ తెలిపాడు.
జట్టులో ఎలాంటి మార్పు చేయలేదని, విన్నింగ్ కాంబినేషన్‌తో బరిలోకి దిగుతున్నామని చెప్పాడు. కండిషన్స్‌ను బట్టి తమ ఆటను అడ్జస్ట్ చేసుకుంటామని తెలిపాడు. తమ ఫీల్డింగ్‌ను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని, మ్యాచ్ మ్యాచ్‌కు తమ జట్టు మెరుగువుతుందన్నాడు. ఆటగాళ్లపై నమ్మకం ఉంచడంతోనే ఇది సాధ్యమైందన్నాడు.

తుది జట్టులో మార్పులు లేవని మార్క్‌రమ్ చెప్పినా.. ఉమ్రాన్ మాలిక్‌పై వేటు వేసారు. అతన్ని సబ్‌స్టిట్యూట్ జాబితాలో చేర్చారు. గత 15 ఏళ్లుగా ఐపీఎల్ ఎంతో మారిందని, ఎన్నో మంచి విషయాలు జరిగాయని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఎంతో మంది ఆటగాళ్లు ప్రపంచానికి పరిచయమయ్యారని చెప్పాడు.
తాము మంచి క్రికెట్ ఆడుతున్నామని, భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచితే సరిపోతుందన్నాడు. కండిషన్స్‌కు తగ్గట్లు తాము ఆడాల్సి ఉందన్నాడు. జట్టులో ఒక మార్పు చేశామని చెప్పిన రోహిత్.. డువాన్ స్థానంలో జాసన్ బెహండార్ఫ్ జట్టులోకి వచ్చాడని చెప్పాడు.
తుది జట్లు:
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, టీమ్ డేవిడ్, కామెరూన్ గ్రీన్, అర్జున్ టెండూల్కర్, నెహాల్ వాదేరా, హృతిక్ షోకీన్, పియూష్ చావ్లా, జాసన్ బెహెండార్ఫ్
సన్‌రైజర్స్ హైదరాబాద్: మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్(కెప్టెన్), హెన్రీచ్ క్లాసెన్(కీపర్), అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, మార్కోజాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, టీ నటరాజన్.