సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ బ్యాటర్ అభిషేక్ శర్మ(23 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 63) విధ్వంసం సృష్టించాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఉప్పల్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. భారీ సిక్సర్లతో ముంబై బౌలర్లను చెడుగుడు ఆడాడు.
సునామీ ఇన్నింగ్స్‌తో 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. అంతేకాకుండా సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేసిన తొలి బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ 18 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా.. అభిషేక్ శర్మ అతన్ని అధిగమించాడు.

ఈ ఇద్దరి కన్నా ముందు సన్‌రైజర్స్ తరఫున డేవిడ్ వార్నర్.. 20 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇప్పటి వరకు ఆరెంజ్ ఆర్మీ తరఫున ఇదే ఫాస్టెస్ట్ ఫిఫ్టీగా ఉండగా.. తాజా మ్యాచ్‌లో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఈ రికార్డును అధిగమించారు. ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పేరిటనే ఉండటం విశేషం.
ఐపీఎల్ 2022 సీజన్‌లో అతను కేకేఆర్ తరఫున 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అతని తర్వాత అభిషేక్ శర్మ 16 బంతుల్లోనే ఈ ఫీట్ సాధించి రిషభ్ పంత్(18), ట్రావిస్ హెడ్(18)లను వెనక్కినెట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున రిషభ్ పంత్ 2018లో 18 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు.
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ విధ్వంసంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ పవర్ ప్లేలోనే వికెట్ నష్టానికి 81 పరుగులు చేసింది. అయితే ఐపీఎల్ చరిత్రలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఇది హయ్యెస్ట్ పవర్ ప్లే స్కోర్ కావడం విశేషం.
మయాంక్ అగర్వాల్ ఔటైన అనంతరం క్రీజులోకి వచ్చిన అభిషేక్ శర్మ.. గెరాల్డ్ కోయిట్జీ వేసిన నోబాల్ ద్వారా లభించిన ఫ్రీహిట్‌ను సిక్స్‌గా మలిచి హిట్టింగ్‌ను మొదలు పెట్టాడు. పియూష్ చావ్లా వేసిన మరుసటి ఓవర్‌లో మూడు భారీ సిక్స్‌లు బాదిన అభిషేక్ శర్మ.. గెరాల్డ్ కోయిట్జీ 8వ ఓవర్‌లో రెండు ఫోర్లు కొట్టాడు. క్వెనా మఫకా వేసిన 10వ ఓవర్‌లో అభిషేక్ శర్మ వరుసగా 4, 6, 6 బాది 16 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరుసటి బంతిని కూడా బౌండరీ తరలించిన అతను.. పియూష్ చావ్లా వేసిన 11వ ఓవర్‌లో భారీ సిక్స్ కొట్టి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.