హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మరో ఓటమి ఎదురైంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో ఉప్పల్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో పేలవ బౌలింగ్‌తో 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. సునాయసంగా గెలవాల్సిన ఈ మ్యాచ్‌ను సన్‌రైజర్స్ ఘోర తప్పిదంతో చేజార్చుకుంది. ఇన్నింగ్స్ 16వ ఓవర్‌ను అభిషేక్ శర్మకు బౌలింగ్ ఇవ్వడం సన్‌రైజర్స్ కొంపముంచింది.
ఈ ఓవర్‌లో స్టోయినీస్, నికోలస్ పూరన్ ధాటికి అభిషేక్ 31 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ ఓటమితో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. మరోవైపు తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అద్భుత విజయాన్నందుకున్న లక్నో.. ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగుపరుచుకుంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులు చేసింది. హెన్రీచ్ క్లాసెన్(29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 47), అబ్దుల్ సమద్(25 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 37 నాటౌట్) రాణించారు. లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్యా రెండు వికెట్లు తీయగా.. యుధ్‌వీర్ సింగ్, ఆవేశ్ ఖాన్, యశ్ థాకూర్, అమిత్ మిశ్రా తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 19.2 ఓవర్లలోనే 3 వికెట్లకు 185 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. యువ ప్లేయర్ ప్రేరక్ మన్కడ్(45 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 64 నాటౌట్) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. మార్కస్ స్టోయినీస్(25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 40), నికోలస్ పూరన్(13 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 44 నాటౌట్) మెరుపులు మెరిపించారు. సన్‌రైజర్స్ బౌలర్లలో ఫిలిప్స్, మయాంక్ మార్కండే, అభిషేక్ శర్మ తలో వికెట్ తీసారు.
శుభారంభం లేదు..
భారీ లక్ష్యచేధనకు దిగిన లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. గ్లేన్ ఫిలిప్స్ వేసిన నాలుగో ఓవర్‌లో కైల్ మేయర్స్(4) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో క్రీజులోకి ప్రేరక్ మన్కడ్‌తో డికాక్ ఆచితూచి ఆడటంతో లక్నో పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 30 పరుగులే చేసింది. అనంతరం డికాక్ జోరుగా ఆడే ప్రయత్నం చేశాడు. అయితే అతని జోరుకు మయాంక్ మార్కండే బ్రేక్ వేసాడు. క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు.
ఒకే ఓవర్‌లో 5 సిక్స్‌లు..
క్రీజులోకి వచ్చిన మార్కస్ స్టోయినీస్‌తో కలిసి ప్రేరక్ మన్కడ్ సూపర్ బ్యాటింగ్ చేశాడు. సన్‌రైజర్స్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన ఈ జోడీ.. స్కోర్ బోర్డును పరుగెత్తించింది. ఈ క్రమంలో 35 బంతుల్లో ప్రేరక్ మన్కడ్ ఐపీఎల్ కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అభిషేక్ శర్మ వేసిన 16వ ఓవర్‌లో రెండు భారీ సిక్స్‌లు బాదిన మార్కస్ స్టోయినీస్(40) మరో షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు.
అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన నికోలస్ పూరన్ వరుసగా మూడు సిక్సర్లు బాది మ్యాచ్‌ను తమవైపు తిప్పుకున్నాడు. నటరాజన్ బౌలింగ్‌లోనూ ప్రేరక్ మన్కడ్ సిక్స్, బౌండరీ బాదడంతో 14 పరుగులు వచ్చాయి. దాంతో లక్నో విజయానికి చివరి 18 బంతుల్లో 24 పరుగులు అవసరమయ్యాయి. పూరన్, మార్కండే అదే జోరును కొనసాగించి విజయలాంఛనాన్ని పూర్తి చేశారు.