హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా విఫలమవుతున్నా.. ఆ జట్టు వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ హెన్రీచ్ క్లాసెన్ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. నిలకడగా రాణిస్తూ జట్టుకు విలువైన పరుగులు అందిస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో గత మ్యాచ్‌లో విన్నింగ్ నాక్ ఆడిన క్లాసెన్.. కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించాడు.
54 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును కెప్టెన్ మార్క్‌రమ్‌తో కలిసి ఆదుకున్నాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో 5వ వికెట్‌కు 70 పరుగులు జోడించాడు. 20 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 36 పరుగులతో జట్టును విజయం ముంగిట నిలబెట్టాడు. అనుకుల్ రాయ్ వేసిన 11వ ఓవర్‌లో ఐదో బంతిని మిడ్ వికెట్ దిశగా క్లాసెన్ భారీ సిక్సర్ కొట్టాడు.

క్లాసెన్ ధాటికి బంతి 101 మీటర్ల దూరంలో పడింది. ఈ షాట్‌కు ఫిదా అయిన జియో సినిమా తెలుగు కామెంటేటర్, వెటరన్ బ్యాటర్ హనుమ విహారి.. క్లాసెన్‌ను తెగ మెచ్చుకున్నాడు. ఉప్పల్‌లో కొడితే బంతి ఉస్మానియాలో పడిందని వర్ణించాడు.
క్లాసెన్ భారీ సిక్సర్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ నోరెళ్లబెట్టింది. చప్పట్లు కొడుతూ క్లాసెన్ సిక్స్‌కు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. దాదాపు 55 మీటర్ల ఎత్తు వెళ్లిన ఈ సిక్సర్ 101 మీటర్ల దూరంలో పడింది. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 171 పరుగులు చేసింది. కెప్టెన్ నితీశ్ రాణా(31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42), రింకూ సింగ్(35 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 46) రాణించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్, మార్కో జాన్సెన్ రెండేసి వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్, కార్తీక్ త్యాగీ, ఎయిడెన్ మార్క్‌రమ్, మయాంక్ మార్కండే తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 166 పరుగులే చేసి ఓటమిపాలైంది. కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్(40 బంతుల్లో 4 ఫోర్లతో 41), హెన్రీచ్ క్లాసెన్(20 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 36) రాణించినా ఫలితం లేకపోయింది. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా, శార్దూల్ ఠాకూర్ రెండేసి వికెట్లు తీయగా.. హర్షిత్ రాణా, ఆండ్రీ రస్సెల్, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తీ తలో వికెట్ పడగొట్టారు. ఆఖరి ఓవర్ వేసిన వరుణ్ చక్రవర్తీ మూడు పరుగులు మాత్రమే ఇచ్చి కేకేఆర్‌ను గెలిపించాడు.