ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ఉప్పల్ వేదికగా ప్రారంభం కావాల్సిన సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ మరింత ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఉప్పల్‌లో భారీ వర్షం కురవడంతో మైదానం మొత్తం చిత్తడిగా మారింది. ప్రస్తుతం వర్షం ఆగినా.. మైదానంలోకి భారీగా వర్షపు నీరు చేరింది.
కవర్లను తీసేసిన మైదాన సిబ్బంది గ్రౌండ్‌ను ఆరబెడుతున్నారు. మైదానాన్ని ఆటకు సిద్దం చేసేందుకు దాదాపు 100 మంది సిబ్బంది కష్టపడుతున్నారు. భారీ వర్షం కారణంగా ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. దాంతో అంపైర్లు ఇంకా టాస్ వేయలేదు. మళ్లీ వర్షం రాకుంటే ఆలస్యంగానైనా మ్యాచ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
కొన్ని ఓవర్లను కుదించి అయినా అంపైర్లు ఆటను నిర్వహించనున్నారు. కానీ మరోసారి వర్షం వస్తే మాత్రం మ్యాచ్‌ను రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింట్ ఇస్తారు. మ్యాచ్ నిర్వాహణకు కటాఫ్ టైమ్ రాత్రి 10.30 గంటలుగా నిర్ణయించారు.

ఎట్టి పరిస్థితుల్లో మ్యాచ్ జరిగేలా చూస్తామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు తెలిపారు. ఫ్యాన్స్ ఆందోళన చెందవద్దని మీడియాతో అన్నారు. రాత్రి 10.30 గంటల్లోపు మ్యాచ్ జరిగే పరిస్థితులు లేకుండా అంపైర్లు ఆటను రద్దు చేస్తారు.
అదే జరిగే మరో మ్యాచ్‌తో సంబంధం లేకుండా సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకుంటుంది. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ 14 పాయింట్స్‌తో టేబుల్‌లో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
గుజరాత్‌తో మ్యాచ్ రద్దయితే ఆరెంజ్ ఆర్మీ ఖాతాలో ఒక పాయింట్ చేరుతోంది. అప్పుడు 15 పాయింట్స్‌తో మరో జట్టుతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్ చేరుతోంది. ఒకవేళ మ్యాచ్ జరిగి గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడితే మాత్రం.. పంజాబ్ కింగ్స్‌తో జరిగే ఆఖరి మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది.
ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ రద్దవ్వాలని కొందరు సన్‌రైజర్స్ అభిమానులు కోరుకుంటున్నారు. కానీ ప్రత్యక్షంగా మ్యాచ్ చూడాలని టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులు మ్యాచ్ జరగాలని వరుణ దేవుడిని ప్రార్థిస్తున్నారు.