ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ఉప్పల్ వేదికగా మరికాసేపట్లో ప్రారంభం కావాల్సిన సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌కు భారీ అడ్డంకి ఏర్పడింది. ఉప్పల్‌లో భారీ వర్షం కురుస్తుండటంతో ఈ మ్యాచ్‌పై నీలి నీడలు కమ్ముకున్నాయి. ప్రస్తుతం ఉప్పల్ మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచగా.. వర్షం గ్యాప్ లేకుండా పడుతోంది.
మరో రెండు గంటల పాటు ఇదే పరిస్థితి ఇలానే ఉంటే ఈ మ్యాచ్ రద్దయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే మైదానంలోకి వర్షపు నీరు భారీగా చేరింది. వర్షం ఆగినా.. ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించనున్నారు. అప్పుడు ఎలాంటి సమీకరణాలు లేకుండా సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకోనుంది.

పంజాబ్ కింగ్స్‌తో వచ్చే ఆదివారం ఇదే మైదానంలో జరగాల్సిన మ్యాచ్ ఓడినా సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ బెర్త్‌కు వచ్చే సమస్య ఏం లేదు. ఇప్పటికే కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకోగా.. రాజస్థాన్ రాయల్స్ మరో బెర్త్‌ను దాదాపు ఖరారు చేసుకుంది. మరో రెండు స్థానాల కోసం సీఎస్‌కే, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆర్‌సీబీ, లక్నో సూపర్ జెయింట్స్ పోటీ పడుతున్నాయి.
అయితే పేలవ రన్ రేట్ ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ ఆఖరి మ్యాచ్‌లో గెలిచినా ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు లేవు. ప్రస్తుతం సీఎస్‌కే, సన్‌రైజర్స్ 14 పాయింట్లతో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. సీఎస్‌కేతో బెంగళూరు వేదికగా జరిగే మ్యాచ్‌లో ఆర్‌సీబీ 18 పరుగుల తేడాతో లేదా 18.1 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేస్తే సీఎస్‌కేను వెనక్కు నెట్టి ప్లే ఆఫ్స్ చేరుతోంది.
సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే గుజరాత్ టైటాన్స్‌తో జరిగే నేటి మ్యాచ్‌తో పాటు పంజాబ్ కింగ్స్‌తో జరిగే ఆఖరి మ్యాచ్‌లో ఒక్కటి గెలిచినా ముందడుగు వేస్తోంది. అయితే వర్షం కారణంగా గుజరాత్‌తో మ్యాచ్ రద్దయితే సన్‌రైజర్స్ ఖాతాలో ఓ పాయింట్ చేరి 15 పాయింట్స్‌తో ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంటుంది. ఆఖరి మ్యాచ్‌లో ఓడినా, గెలిచినా ఆ జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్‌కు వచ్చే నష్టం ఏం ఉండదు.