SRH vs CSK: ధోనీ జైత్రయాత్ర షురూ.. మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అదే.. పూరన్ చెలరేగినా..!

పుణే: ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్‌హైదరాబాద్‌కు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన సన్‌రైజర్స్ 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో బరిలోకి దిగిన చెన్నై సమష్టిగా రాణించి లీగ్‌లో మూడో విజయాన్నందుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసి చెన్నై సూపర్ కింగ్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 202 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్(57 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 99), డేవాన్ కాన్వే(55 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 85 నాటౌట్) చెలరేగారు. ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 182 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని అందించారు. ఈ ఇద్దరి ధాటికి సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు తేలిపోయారు. నటరాజన్ ఒక్కడే రెండు వికెట్లు తీసాడు.
అనంతరం సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 189 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. నికోలస్ పూరన్(33 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో 64 నాటౌట్), కేన్ విలియమ్సన్(37 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 47) రాణించినా ఫలితం లేకపోయింది. చెన్నై బౌలర్లలో ముఖేష్ చౌదరి నాలుగు వికెట్లు తీయగా.. సాంట్నర్, ప్రిటోరియస్ ఒక్కో వికెట్ పడగొట్టారు. కీలక సమయంలో కేన్ విలియమ్సన్ ఔటవ్వడం సన్‌రైజర్స్ విజయవకాశాలను దెబ్బతీసింది. కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్న ధోనీ తొలి మ్యాచ్‌లోనే విజయం సాధించాడు.

శుభారంభం దక్కినా..
203 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ శుభారంభం అందించారు. ఆరంభం నుంచే చెన్నై బౌలర్లపై విరుచుకుపడుతూ ధాటిగా ఆడారు. క్రీజులో కుదురుకున్న ఈ జోడీని ముఖేశ్ చౌదరి విడదీసాడు. షార్ట్ పిచ్ బాల్‌తో అభిషేక్ శర్మను ఔట్ చేశాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 58 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ మరుసటి బంతికే రాహుల్ త్రిపాఠి(0)ని కూడా చౌదరీ అదే తరహా బంతితో గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో సన్‌రైజర్స్ పవర్ ప్లేలో 2 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది.

మ్యాచ్ టర్నింగ్ పాయింట్..
క్రీజులోకి వచ్చిన ఎయిడెన్ మార్క్‌రమ్(17).. మిచెల్ సాంట్నర్ వేసిన 10వ ఓవర్‌లో రెండు భారీ సిక్సర్లతో జోరు కనబర్చాడు. అదే జోరులో మరో భారీ షాట్‌కు ప్రయత్నించిన అంతను బౌండరీ లైన్ వద్ద జడేజాకు చిక్కి వెనుదిరిగాడు. కేన్ మామతో జత కలిసిన నికోలస్ పూరన్ సిక్సర్లతో జోరు కనబర్చాడు. ఆచితూచి ఆడిన ఈ జోడీ ఇన్నింగ్స్‌ను ముందుకు నడపించింది. ప్రిటోరియస్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన కేన్ విలియమ్సన్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దాంతో 3 పరుగుల వ్యవధిలో కేన్ మామ హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. ఇది మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా మారింది.

పూరన్ చెలరేగినా..
ప్రిటోరియస్ బౌలింగ్‌లో పూరన్ భారీ సిక్సర్‌తో 12 పరుగులు పిండుకున్నాడు. ముఖేష్ చౌదరి వేసిన 18వ ఓవర్‌లో శశాంక్ సింగ్(15) క్యాచ్ ఔటవ్వగా.. ఆ వెంటనే సుంధర్(2) కూడా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో సన్‌రైజర్స్ విజయానికి 12 బంతుల్లో 50 పరుగులు అవసరమయ్యాయి. ప్రిటోరియస్ వేసిన 19వ ఓవర్‌లో 13 పరుగులు మాత్రమే రావడంతో ఆఖరి ఓవర్‌లో సన్‌రైజర్స్ విజయానికి 36 పరుగులు అవసరమయ్యాయి. ముఖేశ్ చౌదరి వేసిన ఆఖరి ఓవర్‌లో సిక్సర్, ఫోర్ బాదిన పూరన్.. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో రెండు సిక్స్‌లు బాదిన పూరన్ 24 పరుగులు మాత్రమే పిండుకున్నాడు. దాంతో సీఎస్‌కే విజయం లాంఛనమైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications