
టీమ్ నచ్చలేదంటూ..
ఈ సీజన్ నేపథ్యంలో బెంగళూరు వేదికగా రెండు రోజుల పాటు జరిగిన మెగా వేలంలో సన్‌రైజర్స్ దారుణంగా విఫలమైంది. స్టార్ ఆటగాళ్లందరిని వదిలేసి అనామక ఆటగాళ్లపై కోట్లు కుమ్మరించింది. గతంలో మాదిరే మళ్లీ బౌలర్లతోనే జట్టును నింపేసింది. దాంతో బ్యాటింగ్ విభాగం చాలా బలహీనంగా కనిపిస్తోంది. ఐపీఎల్‌కే బ్రాండ్ అంబాసిడర్ అయిన డేవిడ్ వార్నర్‌ను ఇగోకు పోయి వదిలేసుకుంది. అలా అని ఆ స్థాయి ఆటగాడిని వేలంలో కొనుగోలు చేసిందా? అంటే అది లేదు.
ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్న కేన్ విలియమ్సన్‌ను అట్టిపెట్టుకున్న సన్‌రైజర్స్.. దేశవాళీ స్టార్‌లపైనా దృష్టి పెట్టలేదు. నిలకడలేని నికోలస్ పూరన్ కోసం రూ.10.75 కోట్లు వెచ్చించిన సన్‌రైజర్స్.. మరో రెండు కోట్లు వేస్తే శ్రేయస్ అయ్యర్ దక్కే అవకాశం ఉన్నా.. ఆ ప్రయత్నమే చేయలేదు. రషీద్ ఖాన్ లాంటి స్టార్ స్పిన్నర్‌ను కొనుగోలు చేయలేకపోయింది. సన్‌రైజర్స్ టీమ్ నచ్చలేదంటూ ఆ జట్టు అసిస్టెంట్ కోచ్ బాధ్యతల నుంచి సైమన్ కటీచ్ తప్పుకున్నాడు.

పేపర్‌పై బలంగానే ఉన్నా..
ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎంపిక చేసిన టీమ్‌ను పరిశీలిస్తే పేపర్‌పై బలంగానే కనిపిస్తుంది. జట్టులో ఉన్న ఆటగాళ్లంతా ప్రతిభకు లోటు లేనివారే. కానీ మైదానంలో రాణిస్తారా? అనేది సందేహంగా మారింది. అత్యధిక ధర పెట్టిన నికోలస్ పూరన్.. డేంజరస్ బ్యాట్స్‌మన్. తనదైన రోజున అతన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. అయితే పూరన్ నిలకడగా రాణించడమే అసలు సమస్య. రాహుల్ త్రిపాఠి, సుంధర్ ఎంపిక సరైనదే అయినా.. వికెట్లు తీసే స్పిన్నర్ జట్టులో లేడు. సుంధర్ మంచి ఎకానమీతో బౌలింగ్ చేయగలడే తప్పా వికెట్లు తీయలేడు.
అనామక ప్లేయర్లు అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ ఇప్పటివరకు ప్రూవ్ చేసుకున్నది లేదు. విండీస్ ఆల్‌రౌండర్ రొమారియో షెఫెర్డ్ మంచి ఎంపిక. బిగ్ హిట్టర్‌గా అతను జట్టుకు పనికిరానున్నాడు. బౌలింగ్ విభాగంలో మాజీ ప్లేయర్లు భువనేశ్వర్ కుమార్, నటరాజన్‌లను మళ్లీ తీసుకున్నా.. వారు అంతగా రిథమ్‌లో లేరు. పైగా నటరాజన్ గాయంతో ఇబ్బంది పడుతుంటే.. భువీ పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ ఇద్దరూ మునపటిలా బౌలింగ్ చేయలేకపోతున్నారు. అయితే మార్కో జాన్సన్, కార్తీక్ త్యాగీ, ఉమ్రాన్ మాలిక్‌తో బౌలింగ్ విభాగం బలంగా కనిపిస్తోంది. వికెట్ కీపర్‌గా నికోలస్ పూరన్ ఉండగా.. అతనికి బ్యాకప్‌గా గ్లేన్ ఫిలిప్స్, విష్ణు వినోద్ ఉన్నారు.

ఓపెనర్లుగా కేన్ మామ, అభిషేక్
ఇక సన్‌రైజర్స్‌కు వార్నర్ తరహా విధ్వంసకర ఓపెనర్లు లేరు. దాంతో అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. గతంలో కేన్ ఓపెనింగ్ కూడా చేశాడు. దేశవాళీ క్రికెట్‌లో ఓపెనర్‌గా ఆడిన అనుభవం అభిషేక్‌కు ఉంది. ఆ తర్వాత ఎయిడెన్ మార్క్‌రమ్, రాహుల్ త్రిపాఠి, నికోలస్ పూరన్‌లు బ్యాటింగ్‌కు రానున్నారు. ఆరు, ఏడో స్థానాల్లో వాషింగ్టన్ సుందర్, అబ్దుల్ సమద్ బరిలోకి దిగే అవకాశం ఉంది. 8వ స్థానంలో పేస్ ఆల్‌రౌండర్, భారీ హిట్టర్ రోమారియో షేఫర్డ్ ఆడనున్నాడు. పేసర్లుగా భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, కార్తీక్ త్యాగీ/ఉమ్రాన్ మాలిక్ బరిలోకి దిగనున్నారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు(అంచనా)
అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్, నికోలస్ పూరన్, వాషింగ్టన్ సుందర్, అబ్దుల్ సమద్, రొమారియో షేఫర్డ్, భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, ఉమ్రాన్ మాలిక్/కార్తీక్ త్యాగీ
పూర్తి జట్టు:
నికోలస్ పూరన్(రూ.10.75 కోట్లు), వాషింగ్టన్ సుందర్(రూ. 8.75 కోట్లు)చ రాహుల్ త్రిపాఠి(రూ.8.50 కోట్లు), రొమారియో షెఫెర్డ్(రూ.7.75 కోట్లు), అభిషేక్ శర్మ(రూ.6.50 కోట్లు), భువనేశ్వర్ కుమార్(రూ.4.20 కోట్లు), మార్కో జాన్సెన్(రూ.4.20 కోట్లు), టీ నటరాజన్(రూ.4 కోట్లు), కార్తీక్ త్యాగీ(రూ.4 కోట్లు), ఎయిడెన్ మార్క్‌రమ్(రూ.2.60 కోట్లు), సీన్ అబాట్(రూ.2.40 కోట్లు), గ్లేన్ ఫిలిప్స్(రూ.1.50 కోట్లు), శ్రేయస్ గోపాల్ (రూ.75 లక్షలు), ఫజల్లా ఫరూకీ(రూ.50 లక్షలు), ప్రియమ్ గార్గ్(రూ.20 లక్షలు, జగదీష్ సుచిత్( రూ.20 లక్షలు), సమర్థ్(రూ.20 లక్షలు), శశాంక్ సింగ్(రూ. 20 లక్షలు), సౌరభ్ దూబే(రూ.20 లక్షలు)


Click it and Unblock the Notifications












