ఆస్ట్రేలియా కెప్టెన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సారథి ప్యాట్ కమిన్స్ రెండో సారి తండ్రయ్యాడు. అతని సతీమణి బెకీ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కమిన్స్ దంపతులు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తమ కూతురి ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. ఈ చిన్నారికి కమిన్స్ దంపతులు 'ఇది'అని పేరు పెట్టారు. కూతురు పుట్టడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
'మా ముద్దుల కూతురు 'ఇది' ఇక్కడ ఉంది. ఈ ఆనందాన్ని వర్ణించడానికి మాటలు రావడం లేదు.'అని క్యాప్షన్‌గా పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి 10 గంటలకు ఈ పాప పుట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్యాట్ కమిన్స్ దంపతులకు ఒక కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే. అతని పేరు ఆల్బీ.

ప్రస్తుతం ప్యాట్ కమిన్స్ క్రికెట్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. తన సతీమణి ప్రసవ సమయంలో పక్కన ఉండాలనే ఉద్దేశంతోనే ఆటకు దూరంగా ప్యాట్ కమిన్స్‌కు ఛీలమండ గాయం తిరగబెట్టింది. దాంతో అతను శ్రీలంక పర్యటనకు దూరంగా ఉన్నాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి కూడా దూరమయ్యాడు. అతనితో పాటు జోష్ హెజెల్ వుడ్ కూడా గాయంతో ఈ టోర్నీకి దూరమవ్వగా.. మార్కస్ స్టోయినీస్ అంతర్జాతీయ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించి ఆశ్చర్యపరిచాడు.
ఆటగాళ్ల గాయాలు, రిటైర్మెంట్‌తో ఆసీస్‌కు దెబ్బ మీద దెబ్బ పడింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కమిన్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో టీమిండియా పతనాన్ని శాసించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకున్న ఆసీస్.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది. ఛీల మండ గాయంతో కమిన్స్.. ఐపీఎల్ ఆడటంపై కూడా సందేహాలు నెలకొన్నాయి.